Begin typing your search above and press return to search.

నిర్మ‌లా సీతార‌మ‌న్ లో కొత్త కోణాన్ని చెప్పిన అత్త‌

By:  Tupaki Desk   |   4 Sep 2017 5:02 AM GMT
నిర్మ‌లా సీతార‌మ‌న్ లో కొత్త కోణాన్ని చెప్పిన అత్త‌
X
దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ర‌క్ష‌ణ మంత్రి లాంటి అతి కీల‌క‌మైన ప‌ద‌విని చేప‌ట్టిన రెండో మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించారు తెలుగింటి కోడ‌లు నిర్మ‌ల సీతారామ‌న్‌. తెలుగువారికి సుపరిచితులైన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ స‌తీమ‌ణి అయిన నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిగా ఎంపిక కావ‌టం తెలిసిందే.

అత్యున్న‌త స్థానాన్ని చేరుకున్న త‌న కోడ‌లు గొప్ప‌త‌నం గురించి ఆమె అత్త (కాళికాంబ‌) చెబితే ఆస‌క్తిక‌ర‌మే. తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌తో మాట్లాడిన ఆమె త‌న కోడ‌లు గురించి ఎవ‌రికీ తెలియ‌ని కొత్త విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి ప‌ద‌వి వ‌రించిన త‌ర్వాత హైద‌రాబాద్ శివారులోని నార్సింగ్ లో ఉండే త‌న అత్త కాళికాంబ‌కు ఫోన్ చేసిన నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. "ఇదంతా మీ చ‌ల‌వే అత్త‌య్యా.. ఏ మాత్రం రాజ‌కీయ అనుభ‌వం లేని ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన దాన్ని. మీ ధైర్యం.. ప్రోత్సాహం వ‌ల్లే ఇంత దూరం ఎదిగా" అని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

ర‌క్ష‌ణ మంత్రిగా త‌న‌ను అనౌన్స్ చేసిన త‌ర్వాత అత్త‌గారికి ఫోన్ చేసి విష‌యాన్ని చెప్పిన నిర్మ‌ల గురించి ఆమె చెబుతూ.. మా అమ్మాయి (కోడ‌లు) ఎంత తెలివైన‌దైనా.. స‌మ‌ర్థురాలైనా చాలా అణుకువ‌గా ఉంటుంది. ఇంటిని కంటికి రెప్ప‌లా సంర‌క్షించినా.. మంత్రి ప‌ద‌వికి న్యాయం చేసినా ఆమె ఇలానే ఉంటుందని చెబుతారు.

సామాన్య‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన నిర్మ‌ల సీతారామ‌న్.. మెట్టినింట వారు స్థితిమంతులు.. రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉన్న వారు. పైగా భాష వేరైన‌ప్ప‌టికీ అత్తింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే అంద‌రిలో క‌లిసిపోయారు. లండ‌న్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత పాప (వాజ్ఞ్మయి) పుట్టింది. ఆమెను హైద‌రాబాద్ లోనే పెంచారు. ప్ర‌ణ‌వ పేరిట బ‌డిని ఏర్పాటు చేశారు. విద్యావేత్త‌గా గుర్తింపు పొందారు. అలా ఆమె మ‌హిళా క‌మిష‌న్ లో స్థానం సొంతం చేసుకున్నారు.

నిర్మ‌ల పుట్టింది పెరిగింది త‌మిళ‌నాడులోని తిరుచ్చిరాప‌ల్లిలో. ఆమె అక్క‌డే డిగ్రీ చేశారు. త‌ర్వాత దిల్లీలో జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ వ‌ర్సిటీలో ఎంఏ.. ఎంఫిల్ చేశారు. జేఎన్ యూలో ఉన్నంత కాలం అక్క‌డ ది ఫ్రీ థింక‌ర్స్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వామ‌ప‌క్ష భావ‌జాలానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే జేఎన్ యూలో వామ‌పక్ష భావ‌జాలానికి భిన్న‌మైన ఆలోచ‌న ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించటం మామూలు విష‌యం కాదు. అదే ఆమెను వ‌ర్సిటీలో ప్ర‌త్యేకంగా నిలిపింది.

ఈ సంఘం ద్వారానే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యారు. లండ‌న్ లో ఒక ఇంటీరియ‌ర్ డిజైన్ల షాపులో సేల్స్ గాళ్ గా ప‌ని చేసిన ఆమె ప్రైస్ వాట‌ర్ హౌస్ వంటి దిగ్గ‌జ ఆర్థిక సంస్థ‌లో విశ్లేష‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు కూడా. బీజేపీలో చేరిన త‌ర్వాత ఆమె ఆలోచ‌నా విధానం.. ప్ర‌ణాళిక వేసే తీరుతో గుజ‌రాత్‌.. రాజ‌స్థాన్ ఎన్నిక‌ల‌కు ఎంతో సాయం చేసింది. అదే ఆమెను ఎదిగేలా చేసింది.

టీవీ వివాదాల్లో మిగిలిన వ‌క్త‌లంతా పెద్ద గొంతేసుకొని అరిచేస్తూ.. ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నం చేస్తే.. నిర్మ‌ల మాత్రం అందుకు భిన్నంగా సౌమ్యంగా.. తార్కికంగా త‌న వాద‌న‌ను వినిపించ‌టం ద్వారా దేశీయంగా కోట్లాది మంది మ‌న‌సుల్ని గెలుచుకోవ‌ట‌మే కాదు.. సామాన్యుడు త‌న‌ను తాను చూసుకునేలా నిర్మ‌ల వ్య‌వ‌హ‌రించేవారు.

నిర్మ‌ల ఎంత నిరాడంబ‌రంగా ఉంటార‌న‌టానికి ఒక ఉదంతాన్ని చెప్పాల్సిందే. ఎంత పెద్ద ప‌ద‌విలో ఉన్నా.. ఎలాంటి ఆడంబ‌రం లేకుండా ఉండ‌టం ఆమె గొప్ప‌త‌నంగా చెప్పాలి. ఆమె తీరు ఎలా ఉంటుంద‌న‌టానికి ఇటీవ‌ల జ‌రిగిన ఒక ఉదంతాన్ని చెప్పాలి. విక‌లాంగుల హ‌క్కుల కోసం పోరాడే డాక్ట‌ర్ ఐశ్వ‌ర్యారావు ఆ మ‌ధ్య‌న ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీని క‌ల‌వాల‌నుకున్నారు.

వీల్ ఛైయిర్ లోనే జైట్లీ ఛాంబ‌ర్‌కు వ‌చ్చారు ఐశ్వ‌ర్య‌రావు. జైట్లీ చుట్టు ఉన్న అధికారులు వీల్ ఛైర్లోని వ్య‌క్తిని ప‌ట్టించుకోలేదు. కానీ.. అక్క‌డే ఉన్న మంత్రి నిర్మ‌ల మాత్రం వెంట‌నే స్పందించి.. తాను లేచి ఇలా రండి అంటూ జైట్లీ ప‌క్క‌నున్న త‌న సీటును ఖాళీ చేసి ఆమెకు ఇచ్చారు. ఒక కేంద్ర‌మంత్రిలో ఇలాంటి నిరాడంబ‌ర‌త‌ను తాను ఊహించ‌లేద‌ని.. నిర్మ‌ల కార‌ణంగానే తాను జైట్లీతో ఎక్కువసేపు మాట్లాడే అవ‌కాశం క‌లిగింద‌ని చెబుతారు. అంతేనా..ఆ స‌మావేశం కార‌ణంగానే విక‌లాంగులు ఉప‌యోగించే స‌హాయ ప‌రిక‌రాల‌పై జీఎస్టీని త‌గ్గించాల‌న్న విన‌తికి సానుకూల స్పంద‌న ల‌భించింద‌ని చెప్పాలి. ముగించే ముందు నిర్మ‌ల గురించి మ‌రో కీల‌క విష‌యాన్ని చెప్పాలి. ఆమెకు ఎవ‌రైనా బ‌హుమ‌తులు ఇస్తే తీసుకోరు. సున్నితంగా తిర‌స్క‌రిస్తారు. ఈ మ‌ధ్య‌న మైసూరు వెళ్లిన ఆమెకు ఒక కార్పొరేట‌ర్ శ్రీకృష్ణుడి విగ్ర‌హాన్ని (నిర్మ‌ల‌కు కృష్ణుడంటే చాలా ఇష్టం. ఆయ‌న్ను బాగా కొలుస్తుంటారు) ఇచ్చారు. దాని ధ‌ర రూ.9వేలు మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ ఆ విగ్ర‌హాన్ని తీసుకోవ‌టానికి నిర్మ‌ల ఒప్పుకోలేదు. నో చెప్పేశారు. అంతేకాదు.. ఇలా కానుక‌లు ఇవ్వ‌టం మానుకోవాల‌ని.. అదేమాత్రం మంచి అల‌వాటు కాద‌ని ఆమె చెప్పిన తీరు చూస్తే.. ఆమెలోని ముక్కుసూటిత‌నం ఇట్టే క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.