Begin typing your search above and press return to search.

హోదా అడగాలంటే హోం వర్క్ చేయాలంట!

By:  Tupaki Desk   |   9 Sep 2016 1:21 PM GMT
హోదా అడగాలంటే హోం వర్క్ చేయాలంట!
X
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని - ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారు బీజేపీ నేతలు. ఎవరికితోచిన కుంటి సాకులు వారు చెబుతూ.. హోదా ఇవ్వడం కుదరదు - ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాత్రం చెప్పి గమ్మునున్నారు. దీంతో ఏపీ ఒక్కసారిగా కుదేలయిపోయింది.. ఈ క్రమంలో శనివారం రాష్ట్రబంద్ చేయబోతున్నాయి అన్ని రకాల ప్రజా సంఘాలు - రాజకీయ పార్టీలు. ఏపీలోని అధికారపక్షం మినహా.. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బీజేపీపై ఒత్తిడితెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

రాజకీయ పార్టీలు ముందుగా తగినంత హోంవర్కు చేసి.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అడగాలని అంటున్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. అసలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కు ఏమిచ్చిందో, ఎంత గొప్ప ప్యాకేజీ ఇచ్చిందో తెలుసుకోకుండానే హోదా గురించి మాట్లాడుతున్నారని, ఆ విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా తగినంత హోంవర్కు చేయాలని ఆమె అన్నారు. హోదా కావాలి అంటూ.. రాజకీయ పార్టీలు దాన్ని పెద్ద సమస్యగా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ రూపంలో కేంద్రం చేసిన సాయం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా లేదా అనే విషయంపై చర్చ జరగాలని సూచించారు.

ఏపీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో అంతా తెలుసుకోవాలని, ఇప్పటివరకూ రాష్ట్రానికి ఎంత ఇచ్చాము, ప్యాకేజీ రూపంలో ఇంకా ముందు ముందు ఎంత ఇవ్వబోతున్నామని ఆలోచించకుండా.. విమర్శలు చేయకూడాదని ఆమె చెబుతున్నారు. భారీ రెవెన్యూ లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కేంద్రం ఎంతో కృషిచేస్తోందని.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రూపంలో కూడా ప్రత్యేక సాయం అందిస్తున్నామని చెప్పారు.

అయితే ఇక్కడ ఒక విషయం ఈ కేంద్రమంత్రి గారు మరిచిపోయినట్లున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఓట్లు వేయించుకుని వెళ్లి ఇప్పుడు అధికారంలో కూర్చిని ఇలా మాట్లాడటం భావ్యమా? ప్రత్యేక హొదా గురించి ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకే కాదు.. ఏపీలోని ప్రతీ వ్యక్తికీ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ.. దాన్ని నిలబెట్టుకోవాల్సిన వారు ఇలా ఎదురుదాడికి దిగుతూ మాట్లాడటం ఎంత వరకూ కరెక్టో కూడా ఆలోచించుకోవాలి? మీరు హోదా ఇస్తామని చెప్పి, ఏరు దాటాక బోడి మల్లన్న అనడం ఏమిటని పలువురు ఏపీవాసులు ప్రశ్నిస్తున్నారు.