Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ మాట... సీఏఏను ఎవరూ ఆపలేరట

By:  Tupaki Desk   |   19 Jan 2020 6:05 PM GMT
నిర్మలమ్మ మాట... సీఏఏను ఎవరూ ఆపలేరట
X
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఓ వైపు పెద్ద రాద్ధాంతమే నడుస్తోంటే... దాని అమలును దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం కూడా అడ్డుకోజాలవంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన కామెంట్ చేసింది. ఈ కామెంట్ కూడా మోదీ కేబినెట్ లో కీలకమైన ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ నోట వెంట వచ్చింది. చెన్నై వేదికగా సీఏఏకు మద్దతుగా జన జాగరణ్ అబియాన్ పేరిట ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా సీఏఏపై నిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆమోదించిన సీఏఏ చట్టం అమలును నిరాకరించే విషయంలో రాష్ట్రాలు సఫలం కాలేవని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆమెదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అసలు నిర్మల ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘పార్లమెంటులో ఆమోదం పొందిన సీఏఏ అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం. సీఏఏను అమలు చేయబోమంటూ కేరళ సహా పలు రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడం తప్పు. సీఏఏను అమలు చేయబోమంటూ రాష్ట్రాలు తీర్మానం చేేయవచ్చు. అయితే అది కేవలం ఓ రాజకీయ ప్రకటన మాత్రమే. అవి సీఏఏ అమలును ఆపలేవు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ఉంది. గడచిన ఆరేళ్లలో 2,838 మంది పాకిస్థానీలు, 914 మంది ఆఫ్ఘనిస్థానీలు, 172 మంది బంగ్లా శరణార్ధులకు భారత పౌరసత్వం ఇచ్చాం. వీరిలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం ఇచ్చాం. 201618 మధ్యకాలంలో 1,595 మంది పాకిస్థానీలకు, 391 మంది ఆఫ్ఘన్ వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చాం’ అంటూ సీఏఏకు మద్దతుగా నిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతిమంగా నిర్మల చెప్పిందేమిటంటే.... కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోద ముద్ర వేయించిన సీఏఏ అమలును దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనన్న మాట. ఈ విషయంలో రాష్ట్రాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కుదరదంతే. పార్లమెంటులో కేంద్రం తీర్మానం చేసిందంటే... దేశంలోని అన్ని రాష్ట్రాలు కిక్కురుమనకుండా దానిని అమలు చేసి తీరాల్సిందేనని కూడా నిర్మల సెలవిచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటిదాకా కాస్త మొండి వైఖరితో ముందుకు సాగుతున్న కేరళ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, అసోం అయినా... ఇకపై మారు మాట్లాడకుండా సీఏఏను అమలు చేసి తీరాల్సిందేనన్న మాట. మరి కేంద్రం మాటను ఆయా రాష్ట్రాలు ఎలా పాటిస్తాయో చూడాలి.