Begin typing your search above and press return to search.

60 ఏళ్ల‌లో అంత అప్పు..ఐదేళ్ల‌లో ఇంత అప్పా సారూ?

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:30 AM GMT
60 ఏళ్ల‌లో అంత అప్పు..ఐదేళ్ల‌లో ఇంత అప్పా సారూ?
X
బంగారు తెలంగాణ ల‌క్ష్యంగా ప‌ని చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సారు పుణ్య‌మా అని.. తెలంగాణ బంగారం కావ‌టమేమో కానీ అప్పుల విష‌యంలో మాత్రం తిరుగులేని రీతిలో దూసుకెళుతుంద‌న్న‌ట్లుగా ఉన్నాయి తాజాగా బ‌య‌ట‌కొచ్చిన లెక్క‌లు. రాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వ అప్పులు భారీగా పెరిగి పోయాయి. ఈ లెక్క చూస్తే.. గుండె గుభేల్ మ‌న‌క మాన‌దు.

తాజాగా లోక్ స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ బదులిస్తూ.. ఈ ఏడాది మార్చి నెలాఖ‌రు నాటికి తెలంగాణ అప్పులు 159 శాతం పెరిగిన‌ట్లుగా వెల్ల‌డించారు. తెలంగాణ ఏర్పాటైన ఐదేళ్ల నాటితో పోల్చి ఈ లెక్క‌ను ఆమె చెప్పారు. రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌కారం 2014 జూన్ నాటికి రాష్ట్రంపై రూ.69,517 కోట్ల అప్పు ఉంటే.. కేసీఆర్ జ‌మానాలో ఈ అప్పు ఏకంగా రూ.1,80,239 కోట్లకు చేరుకున్న‌ట్లు తెలిపారు.

2014 త‌ర్వాత రెండేళ్ల వ్య‌వ‌ధిలో అప్పు రూ.20వేల కోట్ల కంటే త‌క్కువ ఉంటు.. 2015-16 నుంచి 2016-17 మ‌ధ్య‌కాలంలో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ రెండేళ్ల మ‌ధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.97,992 కోట్ల నుంచి ఏకంగా రూ.1,34,738 కోట్ల‌కు చేరుకుంది. అంటే.. త‌క్కువ‌లో త‌క్కువ రూ.37వేల కోట్ల అప్పులోకి వెళ్లిపోవ‌టం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రాల్లో ప్ర‌తి ఏటా స‌రాస‌రిన రూ.25వేల కోట్ల వ‌ర‌కు అప్పు ఉండ‌గా.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏకంగా ఈ అప్ప దాదాపుగా రూ.29వేల కోట్ల‌కు పెరిగింది.

ఇక‌.. అప్పుల‌పై వ‌డ్డీ చెల్లింపు భారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్ప‌డిన నాటికి ఏడాదికి కూ.5,593 కోట్లు ఉండ‌గా.. గ‌త ఆర్థిక సంవత్స‌రానికి వ‌డ్డీ చెల్లింపు మొత్తం రూ.11,691 కోట్ల‌కు పెర‌గ‌టం గ‌మ‌నార్హం. విద్యుత్ పంపిణీ సంస్థ‌ల అప్పుల‌ను టేకోవ‌ర్ చేయ‌టానికి వీలుగా ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితికి మించి అప్పు తీసుకోవ‌టానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక‌సారి అనుమ‌తి ఇచ్చిన‌ట్లుగా నిర్మ‌లా చెప్పారు. ఉద‌య్ ప‌థ‌కం కింద 2016-17లో రూ.8923 కోట్లు అప్పుగా ఇచ్చిన‌ట్లు చెప్పారు. బంగారు తెలంగాణ ఏమో కానీ అప్పుల తెలంగాణ మార్చటంలో సారు స‌క్సెస్ అయ్యార‌న్న విమ‌ర్శ వెల్లువెత్తేలా అప్పుల లెక్క ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అప్పుతోనే అభివృద్ధి అనే మాట వినేందుకు బాగానే ఉన్నా.. త‌డిచి మోపెడు అయ్యే వ‌డ్డీల భారీ రాష్ట్రానికి గుదిబండ‌గా మారుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.