Begin typing your search above and press return to search.

సీఎంలు, ఆర్థిక మంత్రులతో ఈ నెల 15న‌ నిర్మలా సీతారామన్‌ భేటీ !

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:47 AM GMT
సీఎంలు, ఆర్థిక మంత్రులతో ఈ నెల 15న‌  నిర్మలా సీతారామన్‌ భేటీ !
X
కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ నెల 15న సోమ‌వారం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆర్థిక‌శాఖ మంత్రుల‌తో స‌మావేశం నిర్వహించబోతున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డం కోసం ప్రైవేటు పెట్టుబ‌డులను ఎలా ఆక‌ర్షించాల‌నే అంశంపై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి టీవీ సోమ‌నాథ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2020, మార్చి నుంచి దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది. మ‌ధ్యలో త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభించింది. ఇలా రెండు క‌రోనా వేవ్‌ లు దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను కుదేలు చేశాయి. లాక్‌ డౌన్‌ లు, నైట్ క‌ర్ఫ్యూల కార‌ణంగా వాణిజ్య‌, వ్యాపార కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. దాంతో ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రాల స్థాయిలో ఆర్థికవ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డానికి ఉన్న అవ‌కాశాలు, స‌వాళ్లు, స‌మ‌స్య‌లపై సోమ‌వారం నాటి స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. కరోనా వైరస్ ను సృష్టించిన ఆర్థిక అనిశ్చితి వాతావరణం నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ వెర్చువల్‌ సమావేశం ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ప్రభుత్వ వైపు నుండి మూలధన వ్యయాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ రంగం వైపు నుండి సానుకూల సెంటిమెంట్‌ ఉంది, అయితే భారీగా మరిన్ని వాస్తవ పెట్టుబడులు రావాలి. క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాలను పరిశీలిస్తే, భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సానుకూల సెంటిమెంట్‌ భారతదేశాన్ని ఉన్నత, స్థిరమైన వృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోందని అన్నారు. ఇది మనం వదులుకోకూడని అవకాశం అని అని సోమనాథన్‌ అన్నారు.

ఈ నేపథ్యం లో భారతదేశాన్ని అధిక వృద్ధికి తీసుకెళ్లడానికి ప్రైవేట్‌ రంగం ద్వారా తీసుకోవలసిన చర్యలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం తీసుకోవలసిన విధానపరమైన చర్యలు ఉన్నాయి. కొన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ఈ దిశలో చర్యలు తీసుకుంటోంది. అయితే భారతదేశాన్ని స్థిరమైన ఉన్నత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవసరమైన పలు చర్యలను రాష్ట్రాలూ తీసుకోవాల్సి ఉంది. కాగా, చర్చించాల్సి ఉన్న రాష్ట్ర స్థాయి అంశాల్లో భూ సంస్కరణలు, జల వనరులు, విద్యుత్‌ లభ్యత, పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అన్న అంశాలు ఉన్నాయని మరో ట్వీట్‌లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ చెప్పారు.