Begin typing your search above and press return to search.

దరిద్రపుగొట్టు వాదన మొదలు.. శ్రీరాముడు దశరథుడి కొడుకు కాదట

By:  Tupaki Desk   |   9 Nov 2021 4:50 AM GMT
దరిద్రపుగొట్టు వాదన మొదలు.. శ్రీరాముడు దశరథుడి కొడుకు కాదట
X
అసలు జరిగిందా? లేదా? శ్రీరాముడు అనే మనిషి భారతావని గడ్డ మీద ఉన్నారా? లేరా? లాంటి ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు చెప్పలేని పరిస్థితి. పురాణ గ్రంధంగా చెప్పుకునే రామాయణానికి సంబంధించి మౌలిక ప్రశ్నలు తలెత్తేలా.. కొత్త తరహా వాదనను వినిపిస్తున్నారు మోడీ సర్కారుకు మిత్రుడు. శ్రీరాముడి తండ్రి దశరధుడు కాదంటూ వివాదాస్పద వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు సంజయ్ నిషాద్. కోట్లాది మంది హిందువులు దైవంగా కొలిచే శ్రీరామ చంద్రుడి పుట్టుక.. తండ్రికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వాదనలకు భిన్నమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

రామాయణం ప్రకారం చూస్తే.. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రఘు వంశ పాలకుడిగా సుపరిచితుడు. అలాంటి శ్రీరాముడి వంశంపై దిక్కుమాలిన వాదనల్ని షురూ చేశారు నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాదని తేల్చారు. ఇక్ష్వాకు కులంలో ఆయన జన్మించలేదంటూ.. ఆయన పుట్టింది నిషాద్ కుటుంబంలో అంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

ఎన్డీయేలో భాగస్వామి పార్టీగా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్నిరేపుతున్నాయి. తాజాగా ఆయన ప్రయాగ్ రాజ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. శ్రీరాముడు తమ నిషాద్ కుటుంబంలో పుట్టారని. ఆయన రుష్య శృంగి కుమారుడన్నారు. దశరథ మహారాజుతో పుత్ర కామేష్ఠి యాగం జరిపించిన రిష్య శృంగి రుషి కుమారుడే శ్రీరాముడన్నారు. ఆయనను దశరథుడి కొడుకుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు.

యాగ ఫలాన్ని స్వీకరించటం ద్వారా ఎక్కడైనా పిల్లలు పుడతారా? అని ప్రశ్నించిన ఆయన.. ‘‘దశరథుడికి పిల్లలు లేరని రిష్య శృంగితో యాగం చేయించారు. యాగ ఫలంగా ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్లే దశరథ మహారాజు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భం దాల్చారు. ప్రసాదం తినడం వల్ల ఎవరైనా గర్భం దాల్చుతారా?’’ అంటూ దరిద్రపు గొట్టు ప్రశ్నల్ని సంధిస్తూ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశారు. సంజయ్ నిషాద్ వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కొత్త గుర్తింపు కోసమే ఈ తరహా వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారన్న మాట వినిపిస్తోంది.