Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డులోకి నీతూ అంబానీ!

By:  Tupaki Desk   |   13 Feb 2018 4:04 PM GMT
టీటీడీ బోర్డులోకి నీతూ అంబానీ!
X
రిలయన్స్ సామ్రాజ్యానికి మహారాణుల్లో ఒకరు నీతూ అంబానీ.. తిరుమల తిరుపతి దేవస్థానల ధర్మకర్తల మండలిలోకి రానున్నారా? అంటే.. అవుననేసమాధానమే అమరావతి వర్గాల నుంచి తెలుస్తోంది. ముంబాయి నుంచి ప్రత్యేకంగా అమరావతికి వచ్చి.. చంద్రబాబునాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయిన ముఖేష్ అంబానీతో చర్చల్లో ఈ అంశం కూడా వచ్చినట్లుగా తెలుస్తున్నది. నీతూ అంబానీకి టీటీడీ బోర్డు సభ్యత్వం కొత్త కాదు. గతంలో కూడా ఆమె బోర్డులో కొన్ని పర్యాయాలు ఉన్నారు. ఈసారి కూడా త్వరలో ఏర్పాటు అవుతుందని భావిస్తున్న టీటీడీ బోర్డులో ఆమెను కూడా సభ్యురాలిగా తీసుకునే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి అంబానీ కుటుంబం తలచుకుంటే.. దేశంలోని ఎలాంటి నామినేటెడ్ పోస్టులు అయినా వారిని వరించి వస్తాయి. కానీ.. వారు ఏ పదవి గురించి ఎన్నడూ పట్టించుకున్నట్టుగా కనిపించదు. తిరుమల బోర్డు పదవి కూడా భగవత్సేవ అనే ఉద్దేశంతోనే స్వీకరిస్తుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఓసందర్భంలో ఆమె టీటీడీ ఛైర్మన్ గిరీని కోరుకున్నారని.. వేర్వేరు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆమెకు సభ్యత్వం మాత్రమే కేటాయించారని కూడా ప్రచారం జరిగింది. ఆ ఏడాది.. బోర్డు పదవీ స్వీకార కార్యక్రమానికి ఆమె రాకపోవడంతో.. ఈ పుకార్లకు మరింత ఊతం వచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత ఆమె విడిగా వచ్చి ప్రమాణస్వీకారం చేశారు.

తాజాగా మళ్లీ టీటీడీ బోర్డు సభ్యత్వ పదవిని చంద్రబాబునాయుడే.. స్వయంగా ఇవ్వజూపినట్లుగా అమరావతి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యాపార సామ్రాజ్యం అయిన అంబానీలను ప్రసన్నంగా ఉంచుకోవడం అనేది కేవలం రాష్ట్రంలో పెట్టుబడులకు మాత్రమే కాదు.. ఇతరత్రా రాజకీయ సమీకరణాల విషయంలో కూడా.. ఎంతో కీలకంగా ఉపయోగపడగలదని.. నలభయ్యేళ్ల అనుభవశీలి చంద్రబాబుకు తెలియని సంగతేమీ కాదు కదా!!