Begin typing your search above and press return to search.

ఫైనల్ లో గెలుపు కోసం నీతూ అంత క‌ష్ట‌ప‌డ్డారు!

By:  Tupaki Desk   |   15 May 2019 5:55 AM GMT
ఫైనల్ లో గెలుపు కోసం నీతూ అంత క‌ష్ట‌ప‌డ్డారు!
X
ఐపీఎల్ సీజ‌న్ ముగిసింది. ఈ సీజ‌న్ విజేత‌గా ముంబ‌యి ఇండియ‌న్స్ నిలిచింది. గ్రౌండ్ లో జ‌ట్టు స‌భ్యులు ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో.. గెలుపు కోసం అంతే ఆత్రుత ప్ర‌ద‌ర్శించిన జ‌ట్టు య‌జ‌మాని నీతూ అంబానీ క‌ష్టం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముంబ‌యి ఇండియ‌న్స్ గెలుపు కోసం మ్యాచ్ మ‌ధ్య‌లో ఆమె బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఆస‌క్తిక‌ర‌మైన ఈ ఉదంతంలోకి వెళితే.. రిల‌య‌న్స్ దిగ్గ‌జం ముకేశ్ అంబానీ స‌తీమ‌ణి నీతూ అంబానీ వైష్ణోదేవి భ‌క్తురాలు. అధ్యాత్మిక చింత‌న కాస్త ఎక్కువే. ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టు య‌జ‌మానిగా.. గెలుపు కోసం తెగ ప్ర‌య‌త్నం చేస్తుంటారు. 2013లో ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన ఆమె.. స్వ‌యంభూవులుగా వెలిసిన అమ్మ‌వార్ల ఆల‌యాల గురించి గూగుల్ లో ఆరా తీశారు. వారికి హైద‌రాబాద్‌లోని బ‌ల్కంపేట‌లో వెలిసిన శ్రీ ఎల్ల‌మ్మ దేవ‌త గురించి తెలుసుకున్నారు. చారిత్ర‌క ఆధారాల ప్ర‌కారం సుమారు 700 ఏళ్ల క్రిత‌మే ఈ ఆల‌యం ఉన్న‌ట్లుగా గుర్తించిన ఆమె.. నీటి మ‌ధ్య‌లో శిలారూపంలో అమ్మ‌వారి విగ్ర‌హం ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకొని అక్క‌డికి వ‌చ్చారు.

నీతూ అంబానీ లాంటి వారు వ‌స్తున్నారంటే ఏర్పాట్లు ఏ స్థాయిలో చేసుకుంటారో తెలుసు క‌దా. అలాంటి ఏర్పాట్లే జ‌రిగాయి. భ‌ద్ర‌తా సిబ్బంది న‌డుమ ఆల‌యానికి వ‌చ్చిన ఆమె.. ఎల్ల‌మ్మ దేవ‌త‌ను ద‌ర్శించుకొని పూజ‌లు నిర్వ‌హించారు. ఆ ఏడాది ఐపీఎల్ విజేత‌గా ముంబ‌యి ఇండియ‌న్స్ నిలిచింది. అనంత‌రం 2015.. 2017లోనూ ఎల్ల‌మ్మ దేవాల‌యానికి ఆమె రావ‌టం.. వ‌చ్చిన ప్ర‌తిసారీ విజేత‌గా నిల‌వ‌టం జ‌రిగింది. ఐపీఎల్ సీజ‌న్ జ‌రిగే వేళ‌లో ఎల్ల‌మ్మ గుడికి రాని స‌మ‌యాల్లో జ‌ట్టు ఓట‌మిపాలు కావ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. తాజా ఫైన‌ల్ మ్యాచ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె.. ఎల్ల‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని అనుకున్నారు. అయితే.. ముంబ‌యి నుంచి హెలికాఫ్ట‌ర్ లో వ‌చ్చిన అంబానీ స‌మ‌యం లేక‌పోవ‌టంతో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఉప్ప‌ల్ స్టేడియంకు వెళ్లిపోయారు. చెన్నై జ‌ట్టు భారీగా స్కోర్ చేయ‌టం.. ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టు ఓట‌మిపై సందేహాలు నీతూ ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపించాయి.

దీంతో మ్యాచ్ విరామ స‌మ‌యంలో ఉప్ప‌ల్ స్టేడియం నుంచి నేరుగా ఎల్ల‌మ్మ టెంపుల్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఫైన‌ల్ జ‌రుగుతున్న రాత్రి 9.10 గంట‌ల వేళ‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఆమె.. విజ‌యం కోసం పూజ చేయాల్సిందిగా పూజారిని కోరారు. గెలుపు మీద న‌మ్మ‌కం లేన‌ట్లుగా ఆ స‌మ‌యంలో ఆమె ఉన్న‌ట్లు ఆల‌య సిబ్బంది చెబుతున్నారు. పూజ అనంత‌రం సాధార‌ణ భ‌క్తులు కూర్చునే ప్ర‌దేశంలో కూర్చున్న ఆమె.. కొద్ది క్ష‌ణాలు ఉండి.. త‌ర్వాత స్టేడియం వెళ్లిపోయారు.

అనూహ్యంగా చివ‌రి బంతికి ముంబ‌యి ఇండియ‌న్స్ విజ‌యం సాధించ‌టం తెలిసందే. ఎల్ల‌మ్మ దేవ‌త సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క్ వుట్ అయ్యింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. జ‌ట్టు గెలుపు కోసం మ్యాచ్ మ‌ధ్య‌లో ఉప్ప‌ల్ స్టేడియం నుంచి అమీర్ పేట వ‌ర‌కూ వెళ్లి.. ప్ర‌త్యేకంగా పూజ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న జ‌ట్టు గెలుపు కోసం నీతూ ఎంత‌లా త‌పించారో తాజా ఉదంతం చెప్ప‌క‌నే చెప్పేస్తుంద‌ని చెప్పాలి.