Begin typing your search above and press return to search.

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత్

By:  Tupaki Desk   |   1 July 2020 2:00 PM GMT
చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత్
X
సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు ఇప్పటికే భారత్ దాని 59 యాప్స్ ను నిషేధిస్తూ నిన్ననే షాకిచ్చింది. అది మరవక ముందే మరో గట్టి జలక్ ఇచ్చింది.

చైనాతో డిజిటల్ వార్ మొదలు పెట్టిన భారత్ ఇప్పుడు మౌళిక వసతుల రంగంలోనూ చైనాకు చెక్ పెట్టింది. భారత జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు ఇకపై అనుమతి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

జాయింట్ వెంచర్లు సహా అన్ని హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతించబోమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇకపై భారత్ లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో చైనా పెట్టుబడులకు చాన్స్ లేదని ఆయన ప్రకటించారు.

అంతేకాదు.. ఇక నుంచి చైనా కంపెనీల నిషేధానికి సంబంధించిన విధివిధానాలు ప్రకటిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత కంపెనీలకే హైవే ప్రాజెక్టుల్లో భాగమయ్యేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తామని .. ఓ విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు.

ఇలా చైనాపై ఇంటా బయటా యుద్ధానికి భారత్ రెడీ అవుతోంది. అటు డిజిటల్ రంగంలో చైనాకు షాక్ ఇచ్చిన భారత్.. తాజాగా మౌళిక వసతుల రంగంలోనూ చైనా పెట్టుబడులకు చెక్ పెట్టింది. ఇది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కావడంతో చైనా కంపెనీలకు భారీ నష్టం తప్పదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరిన్ని రంగాల్లోనూ చైనాకు గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.