Begin typing your search above and press return to search.

నీతి ఆయోగ్ తాజా నివేదిక చూశారా కేసీఆర్? ఏపీ కంటే తెలంగాణే పేద రాష్ట్రం

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:32 AM GMT
నీతి ఆయోగ్ తాజా నివేదిక చూశారా కేసీఆర్? ఏపీ కంటే తెలంగాణే పేద రాష్ట్రం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిస్తే చాలు.. ధనిక రాష్ట్రం.. సంపన్న రాష్ట్రం.. అంటూ ఆయన చెప్పే మాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే..ఆయన నోటి నుంచి అలాంటి మాటలు రావటం ఏ మాత్రం బాగోదన్నట్లుగా నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక చెప్పేసిందని చెప్పాలి. 2015-16 జాతీయ సర్వే వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం.. పేదరికంలో దేశంలో 18వ స్థానంలో నిలిచింది. భారత దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంత ధనికదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏపీ విషయానికి వస్తే.. దేశంలో 20వ పేద రాష్ట్రంగా నిలిచింది. అంటే.. ఏపీ కంటే రెండు స్థానాలు వెనుక బడి ఉందన్న మాట.

ఈ నివేదికను ఆయా రాష్ట్రాల ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి నాలుగు రంగాలను ఆధారంగా చేసుకుని ప్రజల స్థితిగతులను పరిగణలోకి తీసుకుంది. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పోషకాహారం, చిన్నపిల్లల, కిశోర బాలల మరణాలు, తల్లుల ఆరోగ్యం, విద్యారంగంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లిన కాలం, హాజరు శాతం, జీవన ప్రమాణాలకు సంబంధించి వంటనూనెలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, గృహ వసతి, ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని లెక్క కట్టే ప్రయత్నం చేసింది.

తాజా నివేదిక ప్రకారం చూస్తే.. పేదరికంలో బిహార్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిస్తే.. రెండో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. తర్వాతి స్థానంలో గోవా.. సిక్కిం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్ని చూసినప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేద జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో ఏకంగా 27.43 శాతం పేదరికంలో ఉండగా.. రెండు.. మూడు జిల్లాలుగా మహబూబ్ నగర్.. నిజామాబాద్ జిల్లాలు నిలిచాయి.

ఇక.. పేదరికం తక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్.. రంగారెడ్డి.. కరీంనగర్ జిల్లాలు నిలిచాయి. ఆసక్తికకరమైన అంశం ఏమంటే.. పేద జిల్లాగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గోదావరి నది ప్రవేశిస్తుంది. ఇక్కడ అనేక చిన్న నదులు.. వాగులు.. వంకలు ఉన్నాయి. చిన్న.. మధ్య తరహా ప్రాజెక్టుల్ని నిర్మించటానికి అవకాశాలు ఉన్నాయి. సారవంతమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఆదిలాబాద్ జిల్లాను మాత్రం పేదరికం పట్టి పీడిస్తోంది.

మరో విషాదకరమైన అంశం ఏమంటే.. క్రిష్ణానది ప్రవహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా సైతం పేదరికంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా పేదరికంలో రాష్ట్రంలోనే నాలుగోస్థానంలో నిలవటం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ పేదరికం ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ నివేదిక తర్వాత.. కేసీఆర్ నోటి నుంచి తెలంగాణకు ఏమైంది? మాది సంపన్న రాష్ట్రం.. ధనిక రాష్ట్రమన్న మాటలు వచ్చే అవకాశం ఉందంటారా?