Begin typing your search above and press return to search.

థాంక్స్ నితిన్ జీ... ఎందుకంటే... ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:30 PM GMT
థాంక్స్ నితిన్ జీ... ఎందుకంటే... ?
X
కేంద్రం ఏపీకి ఏమీ సాయం చేయడంలేదు అని ఒక వైపు ఏపీవ్యాప్తంగా ఆగ్రహం ఉంది. నిర్వేదం ఉంది. బాధ చాలా ఉంది. ఎన్ని ఉన్నా కూడా అన్నీ అణచుకుని అలాగే ఉన్నారు. ఏ రోజు అయినా కేంద్ర పెద్దల తీరు మారకపోతుందా, కాసింత కరుణ అయినా తమ మీద చూపించకపోతారా అని ఆశపడుతూ ఉన్నారు.

మరి ఆ ఆశ సరికొత్తగా చిగురింపచేయడానికి తాను ఉన్నాను అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుకు వచ్చారనుకోవాలి. ఆయన తన శాఖపరంగా ఏపీకి ఎంత మేలు చేయాలో అంతా చేస్తున్నారు. ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల నిధులను కేవలం ఏపీ రోడ్ల కోసం నితిన్ గడ్కరీ ఇస్తున్నారు అంటే నిజంగా ఇది వింతా విడ్డూరమే.

ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్నీ ఎగ్గొట్టేస్తున్న వేళ అద్దం లాంటి ఏపీ రోడ్లను చూసి అయినా ఇతర ప్రాంతాల వారు ముచ్చట పడతారు. ఏపీలో అభివృద్ధి అన్నది ఆనవాళ్ళు కూడా లేకుండా పోతున్న వేళ కచ్చితంగా ఇపుడు ఈ ప్రగతి దారుల వెంట సాగేందుకు కొందరైనా ముందుకు వస్తారు. మొత్తానికి రోడ్డు అంటే అది అభివృద్ధికి అతి పెద్ద బోర్డు అనే అనుకోవాలి.

ఆ విధంగా చూస్తే నితిన్ గడ్కరీ ఏపీకి చేసిన సాయం చాలా ఎక్కువగానే చూడాలి. రాష్ట్ర పర్యటనకు విజయవాడ వచ్చిన గడ్కరీ చాలా చోట్ల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అంతే కాదు, ఏపీకి భూరి సాయం ప్రకటించారు. మొత్తానికి ఏపీకి నితిన్ గడ్కరీ ఇచ్చిన వరాల లిస్ట్ చూస్తే మాత్రం షాకే అవాలేమో.

అందులో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు ఉన్నాయి. 17 వేల కోట్లతో ఏపీ మీదుగా బెంగుళూరు, చెన్నై హైవే మీదుగా రహదారుల నిర్మాణం ఉంది. ఇక రాయపూర్-విశాఖ, నాగపూర్-విజయవాడ హైవేలు ఇలా చాలానే ఉన్నాయి.

అందుకే థాంక్స్ నితిన్ జీ అని ఏపీ జనాలు మనసారా అంటున్నారు. ఇవన్నీ రానున్న మూడేళ్లలో పూర్తి అయ్యేలా కార్యాచరణ రెడీ చేసి పెట్టుకున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ ప్రగతిది దారులు వేసి నితిన్ గడ్కరీ ఏపీ జనాల మనసు నిండుగా దోచుకున్నారు అనే చెప్పాలి.