Begin typing your search above and press return to search.

కేజీకి రూ.1000 కోట్లు.. ఆ ఎంపీకి ఇది లక్కీ ఛాన్స్

By:  Tupaki Desk   |   12 Jun 2022 1:30 AM GMT
కేజీకి రూ.1000 కోట్లు.. ఆ ఎంపీకి ఇది లక్కీ ఛాన్స్
X
రాజకీయ నాయకులు అన్నాక కార్యకర్తలు నేతలతో విందు, మందులో మునిగితేలాలి. అలా తేలుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా బరువు పెరుగుతుంటారు. సహజంగా ఏ రాజకీయ నేత అయినా ఫిట్ నెస్ కాపాడుకోవడం అసాధ్యం. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఎంపీ, బీజేపీ నేత అనిల్ ఫిరోజియా కూడా తన నియోజకవర్గ నిధుల కోసం వర్కౌట్లతో చెమటోడుస్తున్నారు. డైట్, వ్యాయామం, స్లైక్లింగ్, స్విమ్మింగ్ లు చేసి బరువు తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నారు.

ఇదంతా నియోజకవర్గ నిధుల కోసమే. బరువు తగ్గడానికి సంబందం ఏంటంటే.. అదంతా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సవాల్ పుణ్యమే. ఉజ్జయినిలోని మాల్వాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అధిక బరువుతో ఉన్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువు తగ్గాలని సూచించారు గడ్కరీ.

ఈ క్రమంలోనే ఎంపీకి ఓ సవాల్ కూడా విసిరారు. ‘తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ అనిల్ తరుచూ నన్ను డిమాండ్ చేస్తుంటారు. అయితే అందుకే ఆయనకు నేనే షరతు పెట్టాను. నేను కూడా గతంలో 135 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 93 కేజీలకు తగ్గాను. నా పాత ఫొటో కూడా చూపించాను. నా కండీషన్ ఏంటంటే .. ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే మీరు బరువు తగ్గాలి. ఎన్ని కేజీలు తగ్గితే కేజీకి రూ.1000 కోట్లు చొప్పున నిధులు కేటాయిస్తాను ’ అని నితిన్ గడ్కరీ స్టేజీ మీదే చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఎంపీ అనిల్ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు.

యోగా, ఫిజికల్ వర్కౌట్లు, స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఎంపీ బరువు తగ్గారు. ఫిబ్రవరిలో 127 కేజీలున్న అనిల్.. ఈ మూడు నెలల్లో 15 కేజీలకు తగ్గి 112 కేజీలకు చేరారట.. త్వరలోనే 100 కేజీల దిగువకు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రమంత్రి గడ్కరీ సవాల్ ను నేను స్వీకరించి 15 కేజీలు తగ్గాను. త్వరలో జరగబోయే పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఆయనను కలిసి నా బరువు వివరాలు చెబుతాను. ఆయన తన మాట నిలబెట్టుకొని రూ.15వేల కోట్ల నిధులను మా నియోజకవర్గానికి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాని ఎంపీ చెప్పుకొచ్చారు.

ఇలా బరువు తగ్గితే వేల కోట్లు ఇచ్చే సంప్రదాయం ఒక ఆరోగ్య రహస్యం కోసం ఇవ్వడం వింతేమరీ.. గడ్కరీ ఏది చేసినా ఇలా కొత్తగానే చేస్తాడు.