Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు..జీఎస్టీ.. మోడీని క‌ల‌వ‌ర పెట్టినా..క‌లిసివ‌చ్చాయి

By:  Tupaki Desk   |   18 Dec 2017 4:08 PM GMT
నోట్ల ర‌ద్దు..జీఎస్టీ.. మోడీని క‌ల‌వ‌ర పెట్టినా..క‌లిసివ‌చ్చాయి
X
ఔను. బీజేపీ శ్రేణుల‌నే కాదు...ప్ర‌ధాని మోడీని క‌ల‌వర పెట్టిన రెండు అంశాలు..విజ‌యానికి కూడా బాట‌లుగా మారాయి. ఆ రెండు అంశాలే దేశ‌వ్యాప్తంగా సామాన్యుల‌ను సైతం ఆలోచ‌న‌లో ప‌డేసిన నోట్ల రద్దు - జీఎస్టీ. ఈ రెండు కీల‌క సంస్క‌ర‌ణ‌ల వల్ల గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆ పార్టీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

ఈ సారి ఎన్నికల్లో నోట్ల రద్దు - జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు అబద్ధం అని తేలాయి. ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల వ్యాపార క్షేత్రం సూరత్‌లో తీవ్ర ప్రభావం పడింది. చిన్న - మధ్య తరహా పరిశ్రమలు బిక్కుబిక్కుమన్నాయి. డైయింగ్ - ప్రింటింగ్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడ్డాయి. వాళ్లు కోలుకుంటున్న సమయంలోనే మళ్లీ జీఎస్టీతో మరో పంజా విసిరారు మోడీ. సూరత్‌ లో వజ్ర వ్యాపారులు కూడా ఓ దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అక్కడే భారీ స్థాయిలో ఆందోళనలు కూడా జరిగాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా సూరత్‌ లో ప్రచార సమయంలో పర్యటించారు. ఓటింగ్‌ లో జరిగిన ట్రెండింగ్‌ ను పరిశీలిస్తే ఆ వాస్తవాలు తెలుస్తాయి. తాజా ఎన్నికల్లో కీలకమైన సూరత్ - అహ్మాదాబాద్ - వడోదరా - రాజ్‌ కోట్ - గాంధీనగర్ ప్రాంతాల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. అంటే మరో అయిదేళ్లు ఇక్కడున్న వ్యాపారులు బీజేపీ పాలనకే ఇష్టపడ్డారని తెలుస్తున్నది.

మ‌రోవైపు గుజరాత్‌లో కీలకమైన నగర ప్రాంతాల్లో బీజేపీనే విజయం సాధించింది. సాంప్రదాయకమైన గ్రామీణ ఓటర్లను ఈసారి బీజేపీ కోల్పోయింది. కానీ నోట్ల రద్దు, జీఎస్టీ నేపథ్యంలో...పట్టణ ప్రాంతాలు బీజేపీనే నమ్ముకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మోడీ తీసుకున్న నిర్ణయాలు అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా మారినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ సర్కార్ రైతులకు దూరం అయినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీపై ఓటర్లకు నమ్మకం ఇంకా కుదరలేదని, కానీ ఆ పార్టీ ప్రదర్శన బాగుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. గ్రామీణ - పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు మోడీ - రాహుల్ తెగ ప్రచారం చేశారు. కానీ మోడీ కేవలం పట్టణ ప్రాంత ఓటర్లను మాత్రమే ఆకర్షించారని ప్రస్తుత ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

బీజేపీ మాజీ జాతీయ అద్య‌క్షుడు నితిన్ గ‌డ్క‌రీ సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. అభివృద్ధికి ప‌ట్టం క‌ట్టేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌నే విష‌యం మ‌రోమారో రుజువు అయింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.