Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రుల కంటే కేశినేని నాని గ్రేట్

By:  Tupaki Desk   |   5 Dec 2015 8:22 AM GMT
కేంద్రమంత్రుల కంటే కేశినేని నాని గ్రేట్
X
కేశినేని నాని... కేశినేని ట్రావెల్స్ అధినేతగా రాష్ట్రమంతా పరిచయమున్న వ్యక్తి. పొలిటికల్ గా మాత్రం కృష్ణా జిల్లా దాటి ఆయన పేరు పెద్దగా వినిపించదు. మరి అశోక్ గజపతి రాజు - సుజనాచౌదరి వంటి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులో? వారంటే తెలియనివారుండరు. అశోక్ అజాతశత్రువుగా - మేధావి - సీనియర్ టీడీపీ లీడర్ గా అందరికీ తెలిస్తే.... నిత్యం మీడియాలో ఉండే వ్యక్తిగా, బిజినెస్ మాగ్నెట్ గా సుజనా కూడా అందరికీ పరిచయమే. కానీ కేంద్ర మంత్రులుగా ఉన్న వీరిద్దరి వల్ల కాని పని సాధారణ ఎంపీగా ఉన్న కేశినేని సాధించారు. పైగా అందరూ వ్యతిరేకించిన అంశంలో పట్టు విడవకుండా పనిచేసి చంద్రబాబుతో శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే... రాజకీయంగా ఇది కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఉన్న గ్రూపుల్లో మరింత వేడిని పెంచుతోంది.

ఇంటర్ సిటీ ట్రాన్స్ పోర్టేషన్ సర్వీసుల్లో దేశంలోనే అతి పెద్ద సంస్థగా ఎదిగిన కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని పోటీ చేసిన తొలిసారే విజయవాడ ఎంపీగా గెలిచారు. గెలిచాం కదా అని సరిపెట్టుకోకుండా ఆయన విజయవాడ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పొట్లం కట్టినట్లు రద్దీగా ఉండే విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆయన ప్రయత్నించారు. ఆ క్రమంలో సొంత పార్టీకి చెందిన మంత్రులతోనూ ఆయన తలపడ్డారు. దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ కడితే రద్దీ తగ్గుతుందని గుర్తించిన ఆయన దానిపై దృష్టిపెట్టారు. దానికోసం ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగి పని సాధించుకున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతి సాధించారు.

అక్కడితో ఆగితే ఆయన కేశినేని నాని ఎందుకవుతారు. ఆ శంకుస్థాపనకు ఏకంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని విజయవాడకు తెచ్చారు. ఆ సందర్భంగా విజయవాడ కోసం కేంద్ర మంత్రితో మరో రెండు ప్రకటనలు చేయించి విజయవాడ నగర ప్రజలను ఆకట్టుకున్నారు... తన రాజకీయ ప్రత్యర్తులకు షాకిచ్చారు. బెంజి సర్కిల్ వద్ద ఇంకో ఫ్లై ఓవర్, విజయవాడ చుట్టూ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రితో ఆయన ప్రకటన చేయించారు. నితన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్న ఆ సభలో కేశినేని నాని అంతా తానై వ్యవహరించి విజయగర్వంతో కనిపించారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్ కోసం నాని తన కార్యాలయానికి కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారని నితన్ గడ్కరీ సభలో చెప్పగానే విజయవాడ ప్రజలంతా ఎంతో సంతోషించారు.

ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులు వంటి అంశాల్లో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు చేతులెత్తేస్తున్న తరుణంలో తన నియోజకవర్గంలో ఒక పని కోసం ఒక ఎంపీ పడిన కష్టం ఎంతైనా ఆదర్శనీయమే.