Begin typing your search above and press return to search.

బాబుకు గడ్కరీ షాకులు ఇవ్వబోతున్నారా?

By:  Tupaki Desk   |   2 Jan 2018 4:24 AM GMT
బాబుకు గడ్కరీ షాకులు ఇవ్వబోతున్నారా?
X
పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని - అత్యవసరమైన ప్రాజెక్టు అని అందరూ ఒప్పుకుంటారు. అదే సమయంలో.. ఆ ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు - అపనమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. పనుల నిర్వహణ పేరిట పరిధికి మించి వ్యవహరించడం గురించి.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద అనేక విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్రం – రాష్ట్రం ఒకరి బాధ్యత గురించి మరొకరు డొంక తిరుగుడు ఉపాఖ్యానాలు వల్లె వేస్తూ.. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలకు చేటు చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. తాజాగా కొత్త టెండర్లు పిలవడమూ, కొత్త కాంట్రాక్టర్లకు కొన్ని పనులు అప్పగించడమూ జరిగితే తప్ప.. అసలు పోలవరం పని జరిగే అవకాశమే లేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్న నేపథ్యంలో.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు కొన్ని షాక్ లు ఇవ్వబోతున్నారా అనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.

చంద్రబాబునాయుడు కొత్త టెండర్ల ప్రతిపాదన తెచ్చిన తర్వాత.. కేంద్రం మీద కొన్ని వేల కోట్ల భారంగా మారే ఆ ఆలోచనను గడ్కరీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పాత కాంట్రాక్టరుతో పాత ఒప్పందం ప్రకారం.. ఓపికగా పనులు చేయించుకోవాల్సిందే తప్ప,.. భారం పెంచే ఏ ఆలోచననూ తాము సమర్థించబోయేది లేదని తెగేసి చెప్పారు.

అయితే చంద్రబాబునాయుడు ఆ ఆర్థిక భారాన్ని రాష్ట్రం మీద మోపి అయినా సరే.. కొత్త టెండర్లు పిలవడానికి అత్యుత్సాహం కనబరుస్తున్నా.. అలాంటి పనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప కుదరదు. మరి సుదీర్ఘకాలం గడ్కరీతో బాబు మంతనాలు జరిపిన తర్వాత.. ప్రతి 15 రోజులకు ఓసారి పోలవరం పరిశీలిస్తానన్న గడ్కరీ సుమారు నెలన్నర గడచిపోయిన తర్వాత తొలిసారిగా ఈ నెల 7న పోలవరానికి రానున్నారు. అయితే ఈ పర్యటనలో ఆయన చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చే కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలవరం ఖర్చు తగ్గించుకునే కసరత్తును కేంద్రం ప్రారంభించిన తర్వాత.. కేంద్రం తరఫున పలు నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించి వెళ్లి వేర్వేరు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రప్రభుత్వానికి రుచించని, కొత్త టెండర్లకు అంగీకరించిన ఇతర ప్రతిపాదనలు గడ్కరీ నుంచి వస్తాయని.. పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా 2018లోగా గ్రావిటీ ద్వారా నీళ్లు అనే మాట కోసం కాకుండా, ప్రాజెక్టును సమర్థంగా నిర్మించడం అనేది ఒక్కటే ప్రయారిటీగా కేంద్రం ఆలోచిస్తున్నదని పలువురు అంటున్నారు.