Begin typing your search above and press return to search.

గ‌డ్క‌రీ మాట‌లు..పోల‌వ‌రంపై బాబుకు షాకేనా?

By:  Tupaki Desk   |   6 Dec 2017 12:53 PM GMT
గ‌డ్క‌రీ మాట‌లు..పోల‌వ‌రంపై బాబుకు షాకేనా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు పోల‌వ‌రం రూపంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంది. పోలవరంపై వరుస వివాదాల నేపథ్యంలో ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే... 'మీరే పూర్తి చేస్తామంటే - ప్రాజెక్ట్‌ మీకే ఇచ్చేస్తాం..' అంటూ చంద్రబాబు - అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు కేంద్రం గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించింది. ఇటీవ‌లి కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని పోల‌వ‌రం విష‌యంలో ఇరకాటంలో ప‌డేస్తున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

పోల‌వ‌రంలో అస‌లేం జ‌ర‌గుతోంది - తాము ఇచ్చిన నిధులు ఎన్ని - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు ఎంత‌...వంటి వివ‌రాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 22న గ‌డ్క‌రీ స్వ‌యంగా పోల‌వ‌రంను సంద‌ర్శించ‌నున్నారు. జలవనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రసింగ్‌ - పోలవరం సిఇవో హల్దార్‌ - మెంబర్‌ సెక్రటరీ ఆర్‌ కె.గుప్తాతో కలిసి సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడే సమావేశమై రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోబోయే నిర్ణ‌యాల్లో నిజానిజాలు స‌మీక్షించ‌నున్నారు. న్యూఢిల్లీ నిర్వహించిన పోలవరం పనులపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ - కేంద్ర - రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేహశ్వరరావు - కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ - ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లు - ఉన్నతాధికారులు - కాంట్రాక్టర్లు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు - అధికారులతో సుదీర్ఘంగా రెండున్నర గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ‌డ్క‌రీ కీల‌క కామెంట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

జాతీయ హోదా ద‌క్కిన ప్రాజెక్టును తామే చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించడం - ప‌నుల్లో జాప్యం - అవ‌క‌త‌వ‌క‌లు వంటివి ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రూపంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంతేకాకుండా బీజేపీ నేత‌లు కూడా ప‌లు ద‌ఫాల్లో ఫిర్యాదులు చేశారు. వీటికి తోడుగా... కావాలంటే ప్రాజెక్టు ఇచ్చేస్తాం అని బాబు ప్ర‌క‌టించ‌డం కేంద్రం ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింద‌ని అంటున్నారు. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర‌ప్ర‌భుత్వం తాము ఎంట్రీ ఇవ్వ‌క‌త‌ప్ప‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఢిల్లీలో స‌మావేశం సంద‌ర్భంగా `ప్రాజెక్ట్‌ నిర్మాణం అనుకున్న సమయానికి ఎలా పూర్తి చేయించాలో నాకు తెలుసు..` అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌లు అధికార పార్టీని ఇరకాటంలో ప‌డేస్తున్నాయ‌ని అంటున్నారు. గ‌డ్క‌రీ నేరుగా ఇలాంటి కామెంట్ చేయ‌డంతో చంద్రబాబు సర్కార్‌ కి ఏ స్థాయిలో కేంద్రం షాక్‌ ఇవ్వబోతోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదని అంటున్నారు.

మ‌రోవైపు క్షేత్రస్థాయిలో పనుల జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు మంత్రి గ‌డ్క‌రీ స్వయంగా పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకోవ‌డం కీల‌క మ‌లుపు అని వివ‌రిస్తున్నారు. ఈ నెల 22న పోలవరం ప్రాజెక్టు సందర్శించిన త‌ర్వాత ప్రాజెక్టు భ‌విష్య‌త్‌ పై స్ప‌ష్ట‌త వ‌స్తుందంటున్నారు.