Begin typing your search above and press return to search.
నీతీష్ వెనక పీకే...బీజేపీకి పొలిటికల్ కాక
By: Tupaki Desk | 15 Sep 2022 4:08 PM GMTప్రశాంత్ కిశోర్ అనబడే పీకే మంచి రాజకీయ వ్యూహకర్త. ఆపోజిట్ పోల్స్ ని కలపడంతో సిద్ధహస్తుడు. ఇక మైండ్ గేమ్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఆయనను మొదట బాగా వాడుకున్నది బీజేపీ, మోడీ మాత్రమే. గుజరాత్ ఎన్నికల నుంచి ఢిల్లీలో మోడీ ప్రధాని అయ్యేదాకా పీకే వెనకుండా చాలానే చేశారు. ఆ తరువాత ఆయన బీజేపీని వదిలేసి చాలా పార్టీల వెంటపడ్డారు. అందులో విజయాలు అపజయాలు కూడా ఉన్నాయి.
అయినా పీకే స్ట్రాటజీలకు ఎపుడూ గ్లామర్ తగ్గలేదు. ఆయన చేయాల్సింది చేస్తారని పేరు. ఆయన గెలుపు గుర్రాలనే ఎక్కి ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటారని అంటారు. ఎవరేమన్నా పీకే తాను పట్టిన పార్టీని అధికారం మెట్టు ఎక్కిస్తాడు అని సెంటిమెంట్ ని బాగా తెచ్చుకున్నారు. ఇక బీహార్ కి చెందిన పీకే ఇపుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు.
ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ ని లేటెస్ట్ గా కలసి ముప్పావు గంట సేపు మంతనాలు జరపడమే ఇపుడు అతి పెద్ద చర్చకు తావిస్తోంది. రెండేళ్ళుగా ఆయన జేడీయూలో లేరు. పైగా నితీష్ మీద చీటికీ మాటికీ కామెంట్స్ చేస్తూ చికాకు పెడుతూంటారు. అలాంటి పీకే సడెన్ గా నితీష్ తో ఫోటో పంచుకోవడం అంటే దేశ రాజకీయాలలో అది చాలా సంచలనంగానే ఉంది.
ఒకనాడు మోడీ వెంట ఉండి ఈ దేశాన్ని ఏలడానికి అవతార పురుషుడు వచ్చారు అని గట్టిగా చెప్పి జాతి జనులను ఆకట్టుకుని బీజేపీని ఫుల్ మెజారిటీతో కేంద్రంలో పవర్ లోకి తేవడంలో పీకే పాత్ర చాలానే ఉంది. ఇపుడు ఆయన మరో మాట చెబుతున్నారు. ఈ దేశానికి నిజాయతీపరుడైన వారు ప్రధాని కావాలని. అది కూడా నితీష్ ని కలసిన తరువాత ఈ ప్రకటన పీకే నోటి వెంట వచ్చింది
దీన్ని బట్టి నితీష్ పీకేను తన వైపునకు తిప్పుకున్నారు అనుకోవాలి. ఇక నితీష్ తరఫున దేశమంతా తిరిగి అన్ని పార్టీలను కూడగట్టే బాధ్యతను పీకే తీసుకుంటారు అని అంటున్నారు. నితీష్ కి ఎటూ పాలనాపరంగా మంచి పేరు ఉంది. అలాగే నిజాయతీపరుడు అన్న ట్యాగ్ ఉంది. దాంతో పాటు సీనియారిటీ పరంగా మోడీని ఢీ కొట్టే సత్తా ఉంది.
దాంతో నితీష్ ని ముందు పెట్టి జాతీయ స్థాయిలో రాజకీయ బొమ్మాట ఆడడానికి పీకే రెడీ అవుతున్నారా అన్న చర్చ వస్తోంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలను అన్నీ కలిపి ఒక కూటమి కట్టాలని పీకే ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ విపక్షాల అనైక్యత వల్లనే బాగుపడుతోందని, వరసగా ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తోందని పీకే చాలా బాగానే గుర్తించారు.
ఇపుడు ఆయన అందరినీ కలిపే పనిలో ఉంటారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే విపక్షాలకు 2024లో ప్రధాని అభ్యర్ధి దొరికేసినట్లేనా అంటే అవును అనే అంటున్నారు. ఇక పీకేను తీసుకుంటే ఆయనకు మమతతో పాటు కేజ్రీవాల్, సౌత్ లో జగన్, కేసీయార్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో బలమైన ప్రాంతెయ పార్టీలను ఒక గాటకు చేర్చి ఆ మీదట కాంగ్రెస్ ని అనివార్యమైన పరిస్థితి కల్పించి మద్దతు తీసుకుంటే దేశంలో బీజేపీ విపక్షంలోని రావడం ఖాయమే. మొత్తానికి చూస్తే పీకే మార్క్ ప్లాన్ బీజేపీకి పొలిటికల్ గా కాక పుట్టిస్తుంది అనే చెప్పాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.