Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులే మోడీకి వరాలిచ్చే దేవుళ్లా?

By:  Tupaki Desk   |   16 Sep 2016 4:34 AM GMT
ప్రత్యర్థులే మోడీకి వరాలిచ్చే దేవుళ్లా?
X
ఒక వ్యక్తి ఇమేజ్ ఎలా పెరుగుతుంది? అన్న ప్రశ్న వేస్తే చిత్రంగా చూసే వీలుంది. ఆ మాత్రం తెలీదా? అన్న లుక్ వేయొచ్చు. సాధారణంగా ఒకరి ఇమేజ్ పెరగటానికి సదరు వ్యక్తి పడే కష్టం.. కృషితో పాటు పరిస్థితులు అని చెబుతారు. కానీ.. ప్రధాని మోడీ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన కోణం కనిపిస్తుంది. ఆయనకు పేరుప్రఖ్యాతులు రావటానికి ఆయన సొంతంగా చేసిన కృషి కంటే ఆయన ప్రత్యర్థుల వైఖరే కారణం కావటం విశేషంగా చెప్పాలి. తమ ప్రత్యర్థుల కారణంగా ఇమేజ్ ను భారీగా పెంచుకున్న వైనం మోడీకి మాత్రమే సాధ్యమవుతుందేమో.

అది కూడా తమకు తాముగా చేసిన తప్పులతో తాము తీవ్రంగా వ్యతిరేకించే మోడీ ఇమేజ్ ను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్లిన వైనం ముగ్గురు ముఖ్యుల కారణంగా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మోడీకి ప్రత్యామ్నాయంగా కనిపించిన వారు.. ఇప్పుడు ఆయన ముందు నిలబడటం తర్వాత పోలికకు కూడా పనికిరాని వారిగా మారటం గమనార్హం. ఇందులో మోడీ తనకు తానుగా చేసుకున్న దాని కంటే.. తమ చేతలతో ద్వారా మోడీని మొనగాడిగా మార్చింది మాత్రం ముగ్గురు జాతీయ స్థాయి నాయకులేనని చెప్పక తప్పదు.

స్వచ్ఛమైన పాలనను అందిస్తామని.. తాము సామాన్యులమని.. సామాన్యులకు నేతృత్వం వహిస్తామని డాబు మాటలు చెప్పి.. తమకు దక్కిన అద్భుత అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకోవటమే కాదు.. దేశ వ్యాప్తంగా కొత్త వారిని నమ్మేందుకు సైతం భయపడేలా చేశారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. తమ చేతికి చిక్కిన ఢిల్లీ అధికార పీఠాన్ని తమ సమర్థ పాలనతో దేశానికి ఒక ఆదర్శంగా మార్చటానికి బదులు పీకల్లోతు లైంగిక వేధింపు కేసుల్లోనూ.. పాలనా పరమైన తప్పుల్లోనూ కూరుకుపోయింది. ఢిల్లీ రాష్ట్రం డెంగ్యూ నిలయంగా మారితే.. ఆ బాధ్యతను ఒప్పుకోవటానికి సైతం ముఖ్యమంత్రి సిద్ధంగా లేకపోవటాన్ని చూస్తే.. కేజ్రీ సర్కారు వ్యక్తిగతంగానూ.. వ్యవస్థగానూ ఎంతగా విఫలమయ్యారో ఇట్టే అర్థమవుతుంది.

ఇక.. మోడీ ఇమేజ్ ను అమాంతం పెంచేసిన వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మోడీకి ప్రత్యామ్నాయంగా.. మిస్టర్ క్లీన్ గా ఉన్న ఆయన.. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూతో కలిసి బీహార్ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆయన.. ఇప్పుడా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిస్థితులకు నితీశ్ పాలనా వైఫల్యమన్న మాట వినిపిస్తోంది. బీజేపీతో జట్టు కట్టినంత కాలం తనదైన ముద్రను బీహార్ మీద చూపించగలిగిన నితీశ్.. లాలూతో జట్టు కట్టటం ద్వారా చతికిల పడటమే కాదు.. నితీశ్ ఇలా మారాడేమిటి? అన్న ప్రశ్న కలిగేలా చేశారు. తాజాగా షాబుద్దీన్ ఎపిసోడ్ లో నితీశ్ తనకున్న ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసుకున్నారని చెప్పక తప్పదు.

మోడీకి ప్రత్యామ్నయంగా.. కాంగ్రెస్ భవిష్య ప్రధానిగా చెప్పుకునే రాహుల్ గాంధీ గురించి ఎంత తక్కువగా ప్రస్తావిస్తే అంత మంచిది. ఈ దేశానికి ఎలాంటి నేత అవసరం లేదో.. సరిగ్గా అలాంటి లక్షణాలు రాహుల్ గాంధీలో పుష్కలంగా కనిపిస్తుంటాయి. యువనేతగా దేశాన్ని ఉర్రూతలూగించాల్సిన ఆయన.. తన పనితీరుతో ఆయనో పెద్ద నిరాశగా మారారు. మోడీని నమ్మని వారు.. ఆయన్ను అభిమానించని వారు సైతం.. ఇప్పుడు మోడీ మినహా మరో దిక్కు లేదన్నట్లుగా పరిస్థితిని తయారు చేశారు. అలా చేసింది మోడీ ప్రత్యర్థులే కావటం విశేషం. మోడీని విపరీతంగా వ్యతిరేకించే వారికి ఇంతకు మించిన దురదృష్టం ఇంకొకటి ఉండదేమో. మొత్తంగా మోడీ.. మోడీ అన్న మాట తప్పించి మరో మాట వినిపించే అవకాశం లేకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులే చేశారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.