Begin typing your search above and press return to search.

నితీశ్ అర్జునుడైతే.. మరి మోడీ..?

By:  Tupaki Desk   |   12 May 2016 7:40 AM GMT
నితీశ్ అర్జునుడైతే.. మరి మోడీ..?
X
భారతీయ జనతా పార్టీ నేపథ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సంస్కృతి మీద.. చరిత్ర మీద.. ఇతిహాసాల మీద వారికి మహా గురి. మన ఇతిహాసాల్లోని పాత్రల్ని ఎన్నికల ప్రచారంలోనూ బాగా వాడుకుంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. తమ నేతల్ని పురాణ పురుషుల అవతారాల్లోకి మార్చి ప్రచారం సాగించడం వారి శైలి. ఐతే ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా శైలిలోనే ప్రచారం సాగిస్తూ ఆ పార్టీకి షాకిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. ముఖ్యంగా మోడీకి దీటైన ప్రత్యర్థిగా భావించే నితీశ్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ.. మోడీ సొంత నియోజకవర్గంలో సాగిస్తున్న ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లోనూ పట్టున్న జేడీయూ పార్టీ.. గత లోక్ సభ ఎన్నికల్లో మోడీ గెలిచిన వారణాసి నియోజవర్గానికి 30 కిలోమీటర్ల దూరంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అందులో రథం మీద దూసుకొస్తున్న కృష్ణార్జునుల్ని పోలిన ఫొటోల్ని ఫొటోషాప్ చేసిన పెట్టి తీరు ఆసక్తి రేపుతోంది. ఇందులో నితీశ్ అర్జునుడిలా కనిపిస్తుండగా.. జేడీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ కృష్ణుడి అవతారంలో దర్శనమిస్తున్నాడు. ఈ ఫ్లెక్లీలకు ట్యాగ్ లైన్ గా.. ‘ప్రధాని నరేంద్రమోదీపై.. మత శక్తులపై యుద్ధం’ అని పెట్టారు.

నితీశ్ అర్జునుడైతే మరి మోడీ దుర్యోధనుడా అని చర్చించుకుంటున్నారు వారణాసి జనాలు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది జేడీయూ. ఇందుకోసం భారీ ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా అసెంబ్లీ ఎన్నికలన్నింట్లో ఎదురు దెబ్బలు తింటున్న మోడీకి.. ఉత్తర ప్రదేశ్ లోనూ షాకివ్వాలని మిగతా పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. ఇందుకోసం వైరుధ్యాల్ని పక్కనబెట్టి పొత్తులు పెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.