Begin typing your search above and press return to search.

నిన్న నితీశ్ చేసిన ఫస్ట్ కాల్ ఎవరికంటే..?

By:  Tupaki Desk   |   9 Nov 2015 5:26 AM GMT
నిన్న నితీశ్ చేసిన ఫస్ట్ కాల్ ఎవరికంటే..?
X
దాదాపు పదేళ్లు (కొద్ది కాలం మినహా) బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక నేత మీద ఎలాంటి అవినీతి మరక అంటకుండా ఉండటం సాధ్యమేనా? సమకాలీన రాజకీయాల్లో ఇంత నీతిగా నిజాయితీగా ఉండటం కుదురుతుందా? విపక్షాలు సైతం.. అవినీతి ఆరోపణలు చేసేందుకు వెనుకాడే విలక్షణ వ్యక్తిత్వం నితీశ్ సొంతం. తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘‘మహా’’ విజయం సాధించిన ఆయన.. తన గెలుపునకు సంబంధించిన విషయాన్ని ఎవరికి చెప్పారు?

హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నితీశ్.. తన మనసులోని సంతోషాన్ని ఎవరితో పంచుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వింటే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఎన్నికల సమయంలోచేయటం తన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీజేపీకి చెందిన కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి ఫోన్ చేయటం. తనను తీవ్రంగా వ్యతిరేకించే పార్టీకి చెందిన సీనియర్ నేతకు నితీశ్ ఫోన్ చేయటం ఏమిటన్న సందేహం కలగొచ్చు. కానీ.. వారి మధ్య అనుబంధం అలాంది. నిజానికి.. బీజేపీతో జత కట్టేందుకు ఎవరూ సిద్ధం కాని రోజుల్లో బీహార్ లో అధికార మార్పు కోసం నితీశ్ కమలనాథులతో కలిసిపోయారు.

దీనికి కారణం అద్వానీ లాంటి సీనియర్లే. అయితే.. 2014 ఎన్నికలకు ముందు.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ఎంపిక చేయటంతో నితీశ్ అలకబూనటం.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావటం తెలిసిందే. అంటే.. నితీశ్ కోపమంతా మోడీ మీదనే కానీ.. బీజేపీ మీద కాదన్న విషయం మర్చిపోకూడదు. తాను ఎంతగానో అభిమానించే అద్వానీ 89వ జన్మదినోత్సవం ఆదివారమే కావటం.. ఎన్నికల ఫలితాలు వెలువడటం లాంటి పరిస్థితుల్లో.. నితీశ్ తొలి ఫోన్ కాల్ అద్వానీకి వెళ్లింది.

జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పటమే కాదు.. ఎన్నికల్లో తాము సాధించిన అద్భుత విజయాన్ని ఆద్వానీతో నితీశ్ పంచుకున్నారట. తనను విపరీతంగా వ్యతిరేకించే పార్టీకి చెందిన సీనియర్ నేతతో.. ఇంత సన్నిహితంగా ఉండటం.. అభిమానంగా వ్యవహరించటం అద్వానీ.. నితీశ్ లాంటి వారి జమానాకే సరిపోతుందేమో.