Begin typing your search above and press return to search.

ఏపీకి నితీశ్ దెబ్బేసేశారు!

By:  Tupaki Desk   |   17 Jun 2018 8:03 AM GMT
ఏపీకి నితీశ్ దెబ్బేసేశారు!
X
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత 13 జిల్లాల‌తో ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌... తీవ్ర ఆర్థిక లోటులో చిక్కుకుపోయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో వ‌చ్చిన ఆదాయంలో మెజారిటీ వాటా హైద‌రాబాదు రూపంలో తెలంగాణ‌కు వెళ్లిపోగా... ఏపీకి తీర‌ని న‌ష్ట‌మే జ‌రిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర విభ‌జ‌న అన్యాయంగా జ‌రిగిపోతోంద‌ని నాడు గ‌ళం విప్పిన ఏపీ ప్ర‌జానీకం ఉద్య‌మ బాట ప‌ట్టారు. అందులో భాగంగా ఏపీకి న్యాయం చేయాలంటే రాష్ట్రం ఆర్థికంగా కోలుకునేదాకా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల‌న్న డిమాండ్ వినిపించింది. అయితే అప్ప‌టికే రాష్ట్ర విభ‌జ‌న బిల్లు ముసాయిదా పూర్తి కావ‌డంతో పార్ల‌మెంటులో నాటి విప‌క్షాలు కేంద్రాన్ని నిల‌దీశాయి. దీంతో నాడు ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో బీజేపీ ఎంపీగా ఉన్న ప్ర‌స్తుత భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మొత్తంగా నాడు ఏపీకి ప్ర‌త్యేక హోదాకు అన్ని పార్టీలు దాదాపుగా ఓకే అనేశాయి.

అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలు విప‌క్షంలోకి - విప‌క్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి వ‌చ్చి కూర్చుకున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోగా... ఏపీలో టీడీపీ అధికారం చేప‌ట్టింది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. ఎన్నిక‌ల్లో కొన‌సాగిన పొత్తు మేర‌కు బీజేపీతో చంద్ర‌బాబు మైత్రి మ‌రింత బ‌లోపేతం అయ్యింది. ఈ క్ర‌మంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప‌లుమార్లు కేంద్రం వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టుగా న‌టించిన చంద్ర‌బాబు... చివ‌ర‌కు బీజేపీ అందుకు స‌సేమిరా అంటోంద‌ని, అయినా ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్నార‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీతో మ‌రింత అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు ప్లేట్ ఫిరాయించేశారు. అంతేకాకుండా ఏకంగా ప్ర‌త్యేక హోదా పేరెత్తితే జైల్లో పెట్టిస్తానంటూ హూంక‌రించారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేనంటూ అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న విప‌క్ష వైసీపీ దెబ్బ‌కు దిగొచ్చిన చంద్ర‌బాబు... తిరిగి ప్ర‌త్యేక హోదా బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ఢిల్లీ వేదిక‌గా ప్రారంభమైన నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌రైన చంద్ర‌బాబు... అక్క‌డ ప్ర‌త్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్తారు. అస‌లు ఏపీకి ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేసింది బీజేపీనేన‌ని కూడా ఆయ‌న గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. చంద్ర‌బాబు వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధ‌ప‌డ్డ బీహార్ సీఎం నితీశ్ కుమార్‌... ఏకంగా చంద్ర‌బాబు డిమాండ్‌ ను డ‌మ్మీ చేసే దిశ‌గా పావులు క‌దిపిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు కోరిన‌ట్లుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని పేర్కొన్న నితీశ్... ఏపీ మాదిరి బీహార్‌ కు కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని మెలిక పెట్టేశారు. ఇదే విష‌యాన్ని ఆది నుంచి చెప్పుకుంటూ వ‌స్తున్న న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే ఇత‌ర రాష్ట్రాలు కూడా దానిని కోర‌తాయ‌ని, ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కూడా తేల్చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నీతి ఆయోగ్ భేటీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిచ్చిన‌ట్లుగానే వ్య‌వ‌హ‌రించిన నితీశ్... ఏపీ ప్ర‌జ‌ల‌ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచిన నితీశ్... ఏపీ ప్ర‌జ‌ల పాలిట శనిలా మారిపోయార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.