Begin typing your search above and press return to search.
కుంచెతో తల గోక్కుని కంపు చేసుకున్న సీఎం
By: Tupaki Desk | 6 Feb 2017 8:20 AM GMTరాజకీయ నాయకులు - అందులోనూ ముఖ్యమంత్రి వంటి అత్యంత బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి అనాలోచితంగా చేసినా లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన సదరు చర్యలు ఎంతగా ఫోకస్ అవుతాయనేందుకు ఇదే నిదర్శనం. ఇలా బీహార్ సీఎం నితీశ్ కుమార్ గీసిన పువ్వు బొమ్మతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ఊపందుకుంది. గత బుధవారం పాట్నాలో జరిగిన 23వ పాట్నా పుస్తక ప్రదర్శనకు హాజరైన సీఎం నితీశ్ కుమార్ అక్కడ ఓ పువ్వుబొమ్మ గీసి దానికి కాషాయం రంగు అద్దారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నది. బీజేపీతో అధికారికంగా పొత్తు లేకున్నా ఇప్పటికీ సీఎంకు ఆ పార్టీ అంటే ఇష్టమని, అందుకే పువ్వు బొమ్మ గీసి దానికి ఆ పార్టీ రంగు అద్దారని పలువురు వ్యాఖ్యానించారు. పువ్వుపై చర్చ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నది.
జేడీయూ కూటమిలోని ఆర్జేడీ - కాంగ్రెస్ పార్టీలు ప్రధాని మోదీ తీసుకున్న లక్షిత దాడులు - పెద్దనోట్ల రద్దు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ జేడీయూ మాత్రం ఇప్పటివరకు వీటిపై వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేంద్ర బడ్జెట్ లో బీహార్ ను పట్టించుకోకపోయినా.. సీఎం ఘాటుగా స్పందించలేదు. ఇవన్నీ ప్రస్తుత వ్యాఖ్యలకు బలం చేకూర్చాయి. 'పువ్వు బొమ్మలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. సీఎం పుస్తక ప్రదర్శనకు వెళ్లి బొమ్మగీశారు. దానికి అద్దిన రంగుతో పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేదు. కాషాయ రంగు జాతీయ పతాకంలో భాగం' అని జేడీయూ అధికార ప్రతినిధి తెలిపారు. 'అందరూ బీహార్ అభివృద్ధిని చూస్తుండగా.. వీళ్లు మాత్రం రాష్ర్టాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారు' అని సీఎం నితీశ్ కుమార్ విపక్షాలపై మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/