Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అండ్ కోల‌కు ఆ సీఎంతో మ‌ళ్లీ షాక్

By:  Tupaki Desk   |   10 July 2017 6:18 AM GMT
కాంగ్రెస్ అండ్ కోల‌కు ఆ సీఎంతో మ‌ళ్లీ షాక్
X
కాలం మ‌హా చిత్ర‌మైంది. ఒక‌ప్పుడు మోడీ మాటే న‌చ్చ‌ని ఒక ముఖ్య‌మంత్రి ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న యూట‌ర్న్ కు కార‌ణం అర్థం కాక కాంగ్రెస్ అండ్ కో పార్టీలు త‌ల ప‌ట్టుకుంటున్నాయి. రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు విష‌యంలో విప‌క్షాల‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌.. ఇప్పుడు మ‌రోసారి త‌న‌దైన శైలిలో షాకిస్తున్నార‌ని చెబుతున్నారు.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీయే బ‌రిలోకి దింపిన రామ్ నాథ్ కోవింద్‌ కు త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం ద్వారా త‌న మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ అండ్ కోల‌కు ఆయ‌న ఊహించ‌ని షాక్ ఇచ్చారు. రాష్ట్రప‌తి ఎన్నిక వ‌ర‌కే ఆయ‌న మద్ద‌తు ఉంటుంద‌ని భావించిన కాంగ్రెస్‌ కు.. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక విష‌యంలోనూ ఎన్డీయేకే ఆయ‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న విష‌యం స్ప‌ష్టమై మ‌రోసారి షాకింగ్ గా మారింది.

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్ణ‌యం తీసుకోవ‌టం కోసం ఎన్డీయేత‌ర ప‌క్షాల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కు ఆహ్వానం అందింది. అయితే.. తాను ఆ స‌మావేశానికి హాజ‌రు కాలేన‌ని నితీశ్ స్ప‌ష్టం చేయ‌టం ఎన్డీయేత‌ర ప‌క్షాల‌కు మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నితీశ్ కుమార్ ఎన్డీయేత‌ర ప‌క్షాల‌కు పూర్తిగా దూర‌మైన‌ట్లేనా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవ‌టంతో ద్వారా నితీశ్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆర్జేడీ చీఫ్ లాలూ నివాసంతో సీబీఐ సోదాలు నిర్వ‌హించ‌టం.. ప‌లుచోట్ల దాడులు నిర్వ‌హించిన వైనం పైనా నితీశ్ మౌనంగా ఉండ‌టం ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉంది.

లెక్క తేడా వ‌స్తే.. లాలూ.. కాంగ్రెస్ పార్టీల‌తో క‌టీఫ్ చెప్పేసి.. బీజేపీతో క‌లిసి నితీశ్ జ‌ట్టు క‌డ‌తారా? అన్న‌సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదే జ‌రిగితే.. ఎన్డీయేత‌ర కూట‌మికి భారీ దెబ్బ త‌గిలిన‌ట్లే. ఇదిలా ఉంటే.. నితీశ్ వైర‌ల్ ఫీవ‌ర్ తో బాధ ప‌డుతున్నార‌ని.. అందుకే ఆయ‌న ఏ విష‌యం మీద స్పందించ‌టం లేద‌ని.. స‌మావేశాల‌కు కూడా హాజ‌రు కాలేక‌పోతున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇందులో నిజం ఏమిట‌న్న‌ది రానున్న రోజుల్లో మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.