Begin typing your search above and press return to search.

నితీశ్‌ కు మొద‌టి ఎదురుదెబ్బ‌

By:  Tupaki Desk   |   28 Dec 2015 7:02 AM GMT
నితీశ్‌ కు మొద‌టి ఎదురుదెబ్బ‌
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి దేశం చూపును త‌న‌వైపు తిప్పుకున్న జనతా దళ్ (యునైటెడ్) నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రతికూల పరిస్థితి తప్పడం లేదు. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న ఎన్డీఏ హవాను అడ్డుకోవ‌డంలో స‌క్సెస్ సాధించిన నితీశ్‌ కు ఇపుడు ఢిల్లీ వేదిక‌గా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

పార్లమెంటు పెద్దల సభ అయిన రాజ్య‌స‌భ‌లో జేడీయూ ప్ర‌స్తుతం 12 మంది బ‌లం ఉంది. అయితే త్వ‌ర‌లో ఈ సంఖ్య 9కి పడిపోనుంది. అంటే, ఒకేసారి మూడు సీట్లను ఆ పార్టీ కోల్పోనుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ పెద్దల సభలో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామం ఎదురుకావ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో రాజ్యస‌భ‌లోని ఐదుగురు సభ్యుల పదవీ కాలం ముగియనున్నది. ఈ ఐదుగురు కూడా జేడీయూకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ సీట్లను మళ్లీ దక్కించుకునేందుకు జేడీయూ ఎంత మేర యత్నించినా రెండంటే రెండు సీట్లు మాత్రమే దక్కనున్నాయి. అది కూడా ఆర్జేడీ - కాంగ్రెస్ మద్దతు ఇస్తేనే కావ‌డం ఆస‌క్తిక‌రం.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కేవలం 71 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఆర్జేడీ - కాంగ్రెస్ నుంచి మరో 11 మంది సభ్యుల మద్దతు ఉంటే కాని రెండు సీట్లు దక్కేలా లేవు. అదే సమయంలో ప్రస్తుతం రాజ్యసభలో సింగిల్ సభ్యుడి బలం ఉన్న ఆర్జేడీ తన బలాన్ని ఏకంగా మూడుకు పెంచుకోనుంది. ఎలా అంటే, ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 80 సీట్లలో విజయం సాధించింది. జేడీయూ - కాంగ్రెస్ నుంచి ఇద్దరి సభ్యుల మద్దతు లభిస్తే ఆ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు వచ్చేస్తాయి. ఈ మేర మద్దతు ఆ పార్టీకి పెద్ద సమస్య కాబోదు. మొత్తంగా ఐదు సీట్లను కోల్పోతున్న జేడీయూ రెండు సీట్లతో సరిపెట్టుకుంటుండగా, ఆర్జేడీ మాత్రం మరో రెండు సీట్లను కైవసం చేసుకోనుండ‌టం విచిత్ర‌మే.