Begin typing your search above and press return to search.

న‌ల్ల‌జెండాకు ఆ సీఎం అదిరే స‌మాధానం

By:  Tupaki Desk   |   6 Jan 2018 4:36 AM GMT
న‌ల్ల‌జెండాకు ఆ సీఎం అదిరే స‌మాధానం
X
ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేస్తార‌న్న దానిపైనే ఎంత స‌మ‌ర్థ‌త ఉందో అర్థ‌మ‌య్యేది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రిని జాగ్ర‌త్త‌గా చూస్తే.. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రేం అన్నా వారు అస్స‌లు సహించ‌లేరు. త‌మ‌ను వ్య‌తిరేకిస్తున్నార‌న్న భావ‌నే వారి గొంతులో మార్పు తెచ్చేలా చేసేస్తుంది. ఇలాంటి వేళ త‌మ‌కున్న ప‌వ‌ర్ ను వారు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ ఇలాంటి తీరు ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఎవ‌రైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడినా.. బ‌హిరంగ స‌భ‌ల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శించినా ప‌నికిమాలినోళ్లు అన్న మాట‌నో.. విప‌క్షాల కుట్ర అనో విమ‌ర్శ‌లు చేయ‌ట‌మే కానీ హుందాగా వ్య‌వ‌హ‌రించటం మాత్రం క‌నిపించ‌దు. తాజాగా అలాంటి తీరుతో ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకున్నారో సీఎం. బీహార్ ముఖ్యమంత్రిగా అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్న నితీశ్ కుమార్ తాజాగా ఆయ‌న పాల్గొన్న ఒక బ‌హిరంగ స‌భ‌లో వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది. అన్ని చోట్ల మాదిరే.. బీహార్ ముఖ్య‌మంత్రి పాల్గొన్న బ‌హిరంగ స‌భ‌లో.. కొంద‌రు యువ‌కులు న‌ల్ల‌జెండాలు చూపించారు.

ఇలాంటి ఆందోళ‌న‌లు తాము పాల్గొన్న ప‌బ్లిక్ మీటింగ్ ల‌లో చోటు చేసుకుంటే ఇద్ద‌రి చంద్రుళ్ల రియాక్ష‌న్ ఏ తీరులో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మేఉండ‌దు. కానీ.. నితీశ్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. చ‌తుర‌త‌తో.. నిర‌స‌న‌ను త‌న మాట‌ల‌తో డామినేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు యువ‌కులు న‌ల్ల‌జెండాలు చూపిస్తూ ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు ప‌డుతూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

దీంతో.. అక్క‌డే ఉన్న పోలీసుల వారి ద‌గ్గ‌రున్న జెండాల్ని లాగేసి.. వారిని అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి స్పందించిన నితీశ్‌.. త‌న ప్ర‌సంగాన్ని ఆపి.. పోలీసుల్ని ఉద్దేశిస్తూ.. న‌లుపు రంగులో త‌ప్పేముంది? అది కూడా మంచి రంగే. అస‌మ్మ‌తిని కూడా అంగీక‌రించాల్సిందే. అది ప్ర‌జాస్వామ్యానికి అందం తీసుకొస్తుంది. ఆ యువ‌కులు న‌లుగురైదుగురే ఉన్నారు. మీరు అక్క‌డికి వెళితే మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తారంటూ వ్యాఖ్యానించారు.

నితీశ్ మాట‌ల‌తో ఆ యువ‌కులు త‌మ నిర‌స‌న‌ను నిలిపి వేశారు. ఈ విష‌యాన్ని గుర్తించి సీఎం నితీశ్ త‌న మాట‌ల‌తో మ‌రోసారి ప్ర‌స్తావిస్తూ.. మీ న‌ల్ల జెండాల్ని ఎందుకు దాచిపెట్టారు? మీ నిర‌స‌న‌ను కొన‌సాగించండంటూ వ్యాఖ్యానించారు. సీఎం మాట‌లు స‌భ‌లోని వారి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఆయ‌న చ‌మ‌త్కార ధోర‌ణిని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. విమ‌ర్శ‌లు చేసిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌కుండా నితీశ్ మాదిరి సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌టం బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల నుంచి ఈ త‌ర‌హా స్పంద‌న‌ను ఆశించ‌టం అత్యాశే అవుతుందా?