Begin typing your search above and press return to search.

మోడీ మెడకు నిజామా ‘బాధ’.. స్వయంకృతాపరాధం

By:  Tupaki Desk   |   26 April 2019 4:22 AM GMT
మోడీ మెడకు నిజామా ‘బాధ’.. స్వయంకృతాపరాధం
X
దోమ.. యూనివర్సల్ కీటకం.. దానికి పేద - గొప్ప అనే తేడా తెలియదు.. ముంబైలో ముఖేష్ అంబానీని కుడుతుంది.. అదే ముంబైలోని మురికివాడల్లో ఉన్న ఓ పేదవాడిని కూడా కుడుతుంది. దానికి కేసీఆర్ - మోడీ అన్న భయం లేనే లేదు.. రైతులకు అంతే.. తెలంగాణలో తిరుగులేని విధంగా ఉన్న కేసీఆర్ కూతురుతోనే పోటీపడి నామినేషన్లు వేసి ముప్పుతిప్పలు పెట్టి నిజామాబాద్ పార్లమెంట్ లో కడుపుమండిన రైతులు మూడు చెరువుల నీళ్లు తాగించారు. అక్కడితో వారి పోరాటం ఆగిపోయిందనుకుంటే పొరపాటే. ఎగదోసిన పార్టీలకు షాకిస్తూ ఇప్పుడు పెంచి పోషించిన వారికే జలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు...

*తెరవెనుక ఏం జరిగింది.?

మొన్న జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కల్వకుంట్ల కవిత ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆమె గెలుపు నల్లేరుపై నడకే. కానీ పసుపు - ఎర్రజొన్న రైతులు కవితకు షాకిచ్చారు. ఆమెపై 178మంది రైతులు పోటీచేశారు. దేశం దృష్టిని ఆకర్సించి దేశంలోనే అతి పెద్ద ఎన్నికను నిజామాబాద్ లో జరిగేట్టు చేశారు. కట్ చేస్తే..

నిజానికి కవితపై గెలవడం అసాధ్యమని తెలిసి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ నేతలే తెరవెనుక రైతులను రెచ్చగొట్టి కవితపై పోటీచేయించారని ఇన్ సైడ్ టాక్. సీఎం కేసీఆర్ ను ఇరుకునపెట్టాలని చేసిన వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టింది. బ్యాలెట్ పోలింగ్ కాకుండా ఈవీఎంలతోనే నిర్వహించారు. కానీ కొంత ఇబ్బంది మాత్రం కలిగింది.

ఇప్పుడు ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ - బీజేపీ నేతలు కవితపై ప్రతీకారం తీర్చుకున్నారు. కానీ కొందరు న్యూట్రల్ రైతులు మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. నిజానికి కవితపై పోటీచేసిన 178మంది రైతుల్లో దాదాపు 50 నుంచి 60మంది మాత్రమే సమస్యపై నిజాయితీతో పోరాడుతున్నారు. మిగతా 100 మందికిపైగా బీజేపీ - కాంగ్రెస్ సానుభూతిపరులే. అందుకే కవితపై పోటీచేసిన వారంతా మిన్నకుండగా.. నిజాయితీగల రైతులు మాత్రం ఈ సమస్యను అంతా ఈజీగా వదిలిపెట్టడం లేదు. దేశం దృష్టిని ఆకర్షించాలని మోడీపై వారణాసిలో పోటీకి దిగుతున్నారు. దాదాపు 50మంది నిస్వార్థ నిజామాబాద్ రైతులు బయలుదేరుతున్నారు..

ఈ హఠాత్ పరిణామం బీజేపీకి మింగుడు పడడం లేదు.కేసీఆర్ కూతురు కవితను తిప్పలు పెట్టాలని ఇదే బీజేపీ నేతలు ఎగదోసిన లొల్లి ఇప్పుడు మోడీ మెడకు కూడా చుట్టుకుంటోందట. రైతులు మోడీపై కూడా పోటీకి రెడీ అయ్యారు. పాలు పోసిన పెంచిన నాగు కాటేయకుండా వదలదు అన్న నానుడి ఎంత నిజమో... ఇప్పుడు బీజేపీ పెంచి పోషించిన రైతులు కూడా మోడీపైనే పోటీకి రెడీ కావడం విశేషం. పగవారికి చేటు చేయాలని చూసిన బీజేపీ పరిస్థితి ఇప్పుడు తమ దాకా వస్తే కానీ తీవ్రత అర్థం కావడం లేదని టీఆర్ ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. చేజేతులారా రైతులను రెచ్చగొట్టి బీజేపీ ఇప్పుడు తమ మెడకే దీన్ని చుట్టుకునేలా చేసుకుందని నిజామాబాద్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.