Begin typing your search above and press return to search.

ర‌ద్దైన నోట్లున్నా... ఇబ్బందేమీ ఉండ‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:53 AM GMT
ర‌ద్దైన నోట్లున్నా... ఇబ్బందేమీ ఉండ‌ద‌ట‌!
X
నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం జ‌రిగి దాదాపు ఏడాది కావ‌స్తోంది. గ‌తేడాది న‌వంబ‌రు 8వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హ‌ఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణ‌యం మొత్తం దేశాన్నే ఓ కుదుపు కుదిపేసింది. న‌ల్ల కుబేరుల ప‌నిప‌ట్ట‌డానికే ఈ నిర్ణ‌య‌మ‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు అనుభ‌వించారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా రూ.500 - రూ.1000 నోట్ల స్థానాల్లో కొత్త రూ.500 - రూ.2000 నోట్లు వ‌చ్చాయి. అయితే నోట్ల ర‌ద్దుకు ఏడాది పూర్త‌వుతున్న స‌మ‌యంలో రద్దయిన నోట్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం ప్రకటించింది.

గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్లుగా పాత రూ.500 - రూ.1000 కరెన్సీ నోట్లు కలిగి ఉన్న వారిపై తాము ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం - సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పింది. అంతేకాక రద్దయిన నోట్ల మార్పిడికి ఎలాంటి అవ‌కాశం లేదనీ స్పష్టం చేసింది. పాత నోట్లను డిపాజిట్‌ చేయని వారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధా మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది. 2016 డిసెంబర్‌ 31 వరకు డిపాజిట్‌ చేయని పాత నోట్ల గుర్తింపు కోసం ఏ విధ‌మైన విచారణా జరపబోమని కూడా కేంద్రం పేర్కొంది.

రద్దయిన నోట్లను కలిగి ఉంటే జరిమానా విధిస్తామని నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. రద్దయిన రూ.500 - రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షించ‌ద‌గిన‌ నేరంగా పరిగణిస్తారని పేర్కొంది. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారని - దీనికోసం కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఈ నోట్లు పెద్ద మొత్తంలో ఉంటే క్రిమినల్‌ నేరంగా పరిగణించనున్నట్టు కూడా కేంద్రం హెచ్చరించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ‌ జరిగిన విచారణలో పెద్ద నోట్లను కలిగి ఉంటే తాము ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్రం - సుప్రీంకోర్టుకి తెలిపింది.