Begin typing your search above and press return to search.

షర్మిలకు సెక్యూరిటీ తప్పితే ‘కార్యకర్తలు’ లేరా?

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 AM GMT
షర్మిలకు సెక్యూరిటీ తప్పితే ‘కార్యకర్తలు’ లేరా?
X
వైఎస్ షర్మిల.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో దూసుకొచ్చిన ఈమె పరుష విమర్శలు, పంచ్ డైలాగులతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంత బలంగా షర్మిల పైకి వస్తున్నా ఆమె పరివారం అంత బలహీనంగా ఉందని చెప్పొచ్చు..

తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టిన ఈ రాణి తన వెనుక బలమైన సైన్యాన్ని మాత్రం తయారు చేసుకోలేకపోతోందన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఎక్కడ యుద్ధం చేయాలన్న కేవలం ఒక రాజునో.. రాణినో వెళితే సరిపోదు.. వెనుక అపార పరివారం ఉండాలి. అది లేకపోతే యుద్ధం గెలవలేం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన షర్మిలకు సైతం అదే లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

షర్మిల పైకి ఎంత బలంగా కనిపిస్తున్నా.. ఆమె వెనుక బాడీ గార్డులు తప్పితే పట్టుమని పదవి బలమైన నేతలు కనిపించడం లేదు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి మూడు నాలుగు నెలలు అవుతున్నా కూడా ఒక్క సర్పంచ్ స్థాయి నేత కూడా ఆమెను నమ్మి పార్టీలో చేరడం లేదు. ఇక ఎమ్మెల్యే స్థాయి నేతలు ఇటువైపు చూడడం లేదు. బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు అసలు షర్మిలను ఒక పార్టీ నేతగానే గుర్తించడం లేదు.

ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా షర్మిల తనపై చేసిన కామెంట్లకు బదులిచ్చాడు. షర్మిలను కూరలో కరివేపాకులా షర్మిలను తీసేశారు. ‘అసలు షర్మిల పెట్టింది రాజకీయ పార్టీ కాదని.. అదో ఎన్జీవో సంస్థ అని.. అందువల్లే షర్మిల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదని’ రేవంత్ రెడ్డి గాలితీసేశారు. రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తే మాట్లాడుతానని.. షర్మిల మాట్లాడితే పట్టించుకోమన్నారు. ఇక మీడియా ప్రతినిధులు కూడా ఆ ఎన్జీవో సంస్థను, షర్మిలను పట్టించుకోకుంటే తెలంగాణకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు షర్మిల పరువుతీసేలా ఉన్నాయి. ఇక షర్మిలకు అన్న జగన్ తో పడడం లేదని.. జగన్ ఆదరణ లేకపోవడంతోనే ఆ కోపాన్ని తమపై తీర్చుకుంటోందని ఆమె బ్యాక్ గ్రౌండ్ ను కెలికేసి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఆమెను పట్టించుకోమంటూనే రేవంత్ రెడ్డి ఆమె గాలితీసేలా మాట్లాడిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

వైఎస్ఆర్ చరిష్మాతో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిలకు తోడుగా ఆ వైఎస్ఆర్ పాత నేతలు, అభిమానులు ఎవ్వరూ అండగా నిలబడడం లేదు. వైఎస్ఆర్ హయాంలో మంత్రులు, ఆయన దయతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఇప్పుడు చాలా మంది మాజీలుగా ఉన్నారు. వారు సైతం షర్మిల పార్టీలో చేరడం లేదు. ఇక ఇటీవల పీసీసీ చీఫ్ చేయలేదని అలిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లో అటుగా వెళుతూ షర్మిల పార్టీ ప్రకటన సభకు వచ్చాడు. అప్పుడు షర్మిల తన పార్టీలోకి రావాలని వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా చేసిన కోమటిరెడ్డిని కోరింది. కానీ దానికి కోమటిరెడ్డి నో చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వదలనన్నాడు.

ఇలా షర్మిల నోరు తెరిచి అడిగినా.. పిలుపునిచ్చినా కూడా తెలంగాణలో ఆమె పార్టీలోకి వలసలు రావడం లేదు. షర్మిల తర్వాత తెలిసిన ముఖం ఒక్కరూ ఆ పార్టీలో లేరు. కనీసం ఒక్క బలమైన నేత కూడా ఆమె వెన్నంటి కనిపించడం లేదు. నేతలు లేకుండా.. కార్యకర్తల బలం లేకుండా షర్మిల ఏమేరకు తెలంగాణ రాజకీయాల్లో పోరాడుతుంది? అనేది ప్రధాన ప్రశ్న. తెలంగాణ సమాజం, నేతలు అంతా షర్మిలను ఇప్పటికీ ‘ఆంధ్రా ఆడబిడ్డ’గానే చూస్తూ తెలంగాణ బిడ్డగా చూడకపోవడమే ఆమె పార్టీకి ఈ రాష్ట్రంలో ఆదరణ లేకపోవడానికి కారణం అని అంటున్నారు.

ఏది ఏమైనా ఒక పార్టీని నడిపించాలన్నా.. ముందుకు పోవాలన్నా నేతలు, కార్యకర్తల బలం అత్యవసరం.. అది లేకుండా షర్మిల ఎంత గొంతుచించుకున్నా తెలంగాణలో ఆమె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినపడే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.