Begin typing your search above and press return to search.

2019 లో మాది ఒంటరి పోరే : కేసీఆర్‌

By:  Tupaki Desk   |   18 Jan 2018 2:32 PM GMT
2019 లో మాది ఒంటరి పోరే : కేసీఆర్‌
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని.. తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని స్ప‌ష్టం చేశారు. ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశమంటే రాష్ర్టాల సమాహారమే. మనది సహకార సమైక్య వ్యవస్థ అన్న ప్రధాని మాటలను సమర్థిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ర్టాల సంపదే జాతి సంపద. కాబట్టి రాష్ర్టాలు మరింత ఎదిగేందుకు కేంద్రం అవకాశం ఇవ్వాలని.. వాటిని ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు.

కీల‌క‌మైన రిజ‌ర్వేష‌న్ల గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. 50 శాతం రిజర్వేషన్లు సరిపోవని.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. `తెలంగాణలో 90 శాతం జనాభా ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ర్టానికి ఆయా పరిస్థితులకనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశమివ్వాలి` అని కేసీఆర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అందరికీ రిజర్వేషన్లు అందించాలన్నారు. పక్క రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ల శాతం పెంచినప్పుడు తామెందుకు పెంచకూడదన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను లేవనెత్తుతామన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలిసి వెళ్లాల్సిన అవసరం తమకు లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తాము స్వతంత్రంగానే ఉంటామని స్పష్టం చేశారు. వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి మాట్లాడే వారు వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. త‌న కుటుంబ స‌భ్యులు ప‌ద‌వుల్లో ఉన్నార‌ని ఇప్పుడు విమ‌ర్శించే వారు...ఉద్య‌మంలో కూడా వారున్నార‌నే విష‌యాన్ని గ‌మ‌నించాల‌న్నారు. ఆ సమయంలో అనేక కేసులు ఎదుర్కొంటున్నార‌ని... ప్రజల చేత వారు ఎన్నుకొన్నందునే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని కెసిఆర్ చెప్పారు.తెలంగాణ ప్రజలే తన ఫ్యామిలీ అని కేసీఆర్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణకు పోలికే లేదన్నారు సీఎం కేసీఆర్. ఆ రాష్ట్రం కంటే ఎంతో ముందుందన్నారు. త్వరలోనే ధనిక రాష్ట్రాలలో ఒకటిగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రగతి భవన్ అధికారిక నివాసమని చెప్పారు. అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరని.. నా తర్వాత ఎందరో సీఎంలు వస్తారన్నారు. దేశంలోనే మానవ వనరుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు . గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాలకు గొర్రెలు, మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుంద‌ని సీఎం తెలిపారు.