Begin typing your search above and press return to search.

జైట్లీ క్వ‌శ్చ‌న్ల‌కు త‌మ్ముళ్ల షాకింగ్ రియాక్ష‌న్..!

By:  Tupaki Desk   |   7 March 2018 4:43 AM GMT
జైట్లీ క్వ‌శ్చ‌న్ల‌కు త‌మ్ముళ్ల షాకింగ్ రియాక్ష‌న్..!
X
మీడియా మైకులు క‌నిపిస్తే చాలు.. పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా చెల‌రేగిపోతున్నారు ఏపీ తెలుగుదేశం నేత‌లు. మొన్న‌టి వ‌ర‌కూ హోదా వ‌ద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ జ‌పం చేసిన త‌మ్ముళ్లు కాస్తా ఇప్పుడు మాత్రం హోదాయే ముద్దు అంటున్నారే కానీ.. ప్యాకేజీ గురించి మాట వ‌ర‌స‌కు మాట్లాడ‌టం లేదు. ఈశాన్య రాష్ట్రాల‌కు ఇస్తున్న రీతిలో ఏపీకి హోదా ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

హోదా విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయాల్సిందంతా చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రోసారి హోదా రాగాన్ని తీస్తున్నారు. ఆయ‌న వేసిన కుప్పిగంతుల పుణ్య‌మా అని ఏపీ హోదా విష‌యంలో లేనిపోని ఎపిసోడ్లు చోటు చేసుకున్నాయ‌ని చెప్పాలి. మొద‌ట్నించి మాకింకేమీ వ‌ద్దు.. విభ‌జ‌న స‌మ‌యంలో చెప్పిన రీతిలో ప్ర‌త్యేక‌హోదా ఇస్తే చాలు అని తేల్చి చెప్పి ఉంటే బాగుండేది. కానీ.. మ‌ధ్య‌లో ప్యాకేజీ వ్య‌వ‌హారాన్ని తీసుకొచ్చి.. హోదా డిమాండ్ పై లేనిపోని క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేశారు.

ఈ రోజున బీజేపీతో క‌టీఫ్ చెప్పేందుకు వీలుగా.. మోడీ స‌ర్కారు మొద‌ట్నించి ఇవ్వ‌న‌ని చెబుతున్న హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదేమంటే.. హోదాతోనే ఏపీ ఇబ్బందులు తీరిపోతాయ‌ని చెబుతున్నారు. మ‌రింత కాలం ఏం చేసిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చింద‌ని.. హోదా సాధ‌న కోసం ఎంత‌కైనా సిద్ధ‌మంటూ హ‌డావుడి చేస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. తాజాగా కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీతో స‌మావేశ‌మ‌య్యారు. మీడియా ముందు చెల‌రేగిపోతున్న త‌మ్ముళ్లు.. ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్ర‌యించిన‌ట్లుగా స‌మాచారం.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో మొద‌ట్నించి ఒకే స్టాండ్ తో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్ప‌డూ అదే వాద‌న‌ను వినిపించ‌టం.. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించిన అధికార టీడీపీ.. ఇప్పుడు ఉన్న‌ప‌ళంగా ప్యాకేజీ మాట‌ను వ‌దిలేసి హోదా రాగాన్ని ఆల‌పిస్తోంది. త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా కేంద్రాన్ని మారాల‌ని కోరుతోంది. ఏపీకి ఇవ్వాల్సిన వాటి విష‌యంలో మొద‌ట్నించి క్లారిటీతో ఉన్న కేంద్రం.. ఏపీకి హోదా ఇవ్వ‌లేన‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేసింది. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. వ్య‌క్తిగ‌తంగా ఉన్న కేసుల బాధ‌ను త‌ప్పించుకోవ‌టం కోసం ప్యాకేజీకి ఓకే చెప్పి.. ఇప్పుడు ప్ర‌జ‌ల ఒత్తిడితో హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీకి వెళ్లిన టీడ‌పీ బృందం కేంద్ర‌మంత్రి జైట్లీని క‌లిసిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ పై జైట్లీ రియాక్ట్ అవుతూ.. ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్లుగా తెలుస్తోంది. వేటికి స‌మాధానం ఇవ్వ‌ని టీడీపీ బృందం మౌనాన్ని ఆశ్ర‌యించింద‌ని చెబుతున్నారు.

మీరే క‌దా హోదా అవ‌స‌రం లేదు. ప్యాకేజీ స‌రిపోతుంద‌ని చెప్పింది.. ఇప్పుడేమో మ‌ళ్లీ ఇలా మాట్లాడుతున్నారేంటి?

ప‌న్నురాయితీలు ఇస్తే పొరుగు రాష్ట్రాలు ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని.. కాంగ్రెస్ ఎంపీ వీర‌ప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక అంశాల‌పై పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ వ్య‌తిరేకించింద‌ని.. అందువ‌ల్ల ఆ అవ‌కావం లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు జ‌వాబు ఎందుకు చెప్ప‌టం లేదంటూ జైట్లీ వేసిన వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో త‌మ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్లుగా చెబుతున్నారు. జైట్లీ మాష్టారు నాన్ స్టాప్ గా క్వ‌శ్చ‌న్ల మీద క్వ‌శ్చ‌న్లు వేస్తుంటే.. త‌మ్ముళ్లు మాత్రం నోటికి తాళాలు వేసుకున్న‌ట్లుగా మౌనంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి బ‌లమైన వాద‌న‌ను వినిపించ‌క‌పోవ‌టంపై విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా అంటూ గ‌ద్దించే త‌మ్ముళ్లు జైట్లీ ఎదుట ఎందుకంత మౌనంగా ఉన్నార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.