Begin typing your search above and press return to search.

నో బాల్.. ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఎగ్జిట్

By:  Tupaki Desk   |   28 March 2022 7:18 AM GMT
నో బాల్.. ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఎగ్జిట్
X
ఒకే ఒక్క నో బాల్.. ప్రపంచ కప్ టోర్నీ నుంచి భారత్ మహిళా క్రికెట్ జట్టును నిష్క్రమించేలా చేసింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో చివర్లో పడిన ఒక నో బాల్ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. గెలుస్తామన్న సంతోషానికి బదులు.. మ్యాచ్ ఓడటమే కాదు.. టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. మొత్తంగా ఒక నో బాల్ టీమిండియా మహిళా జట్టు కొంప ముంచటమే కాదు.. ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ సొంతం చేసుకుంటుందన్న కోట్లాది మంది ఆశ నిరాశగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా మహిళా జట్టు చివర్లో పడిన తడబాటు.. టోర్నీ నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేసింది.

275 పరుగుల టార్గెట్ పూర్తి చేయటానికి దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళలో.. బౌలింగ్ చేస్తున్న భారత్ జట్టులో కీలక బాధ్యతను తీసుకుంది ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ. నరాలు తెగేంత ఉత్కంఠ వేళ.. మొదటి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతికి మరో పరుగు వచ్చింది. మూడో బంతికి బ్యాట్స్ మెన్ రనౌట్ కావటంతో మ్యాచ్ మీద భారత్ పట్టు బిగిసినట్లైంది.

తర్వాతి నాలుగో బంతికి ఒక్క పరుగు రాగా.. ఐదో బంతికి డుప్రీజ్ భారీ షాట్ ఆడటం.. గాల్లో లేచిన బంతిని లాంగాన్ లో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ అందుకోవటంతో మ్యాచ్ గెలిచామన్న సంబరానికి గురయ్యారంతా. ఒక్క బంతికి మూడు పరుగులు కష్టమన్న వేళ.. అంపైర్ అనూహ్య నిర్ణయం ఒక్కసారి షాక్ కు గురి చేసింది.

ఐదో బంతి నో బాల్ గా ప్రకటించటంతో భారత్ జట్టుకే కాదు.. మ్యాచ్ చూస్తున్న భారత్ క్రీడాభిమానులకు షాక్. తర్వాతి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ మీద విజయం సాధించింది. దీంతో.. చావో రేవో తేల్చే మ్యాచ్ ఓటమితో ప్రపంచ కప్ నుంచి భారత్ కథ ముగిసి.. టోర్నీ నుంచి ఎగ్జిట్ అయిన పరిస్థితి. సెమీస్ కు చేరాలంటే కచ్ఛితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో మిథాలీ సేనకు చుక్కెదురు కావటమే కాదు.. టోర్నీ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడంది.

ఇక.. మొదట బ్యాట్ చేసిన భారత జట్టులో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులతో భారీ స్కోర్ ను ప్రత్యర్థి ముందు ఉంచింది. స్మ్రతి మంధాన 71, షెఫాలీ వర్మ 53, మిథాలీ 68, హర్మన్ ప్రీత్ 48 పరుగులు చేయటంతో భారీ స్కోర్ కు సాధ్యమైంది.

బౌలింగ్ విషయానికి వస్తే.. స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు.. హర్మన్ ప్రీత్ రెండు వికెట్లు సాధించినా.. చివర్లో పడిన ఒక నో బాల్ మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేయటమే కాదు.. టోర్నీ నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.