Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో 'నో బాల్' లొల్లి.. వాకౌట్ వివాదం

By:  Tupaki Desk   |   23 April 2022 2:30 PM GMT
ఐపీఎల్ లో నో బాల్ లొల్లి.. వాకౌట్ వివాదం
X
గెలవాలంటే ఆరు బంతుల్లో 36 పరుగులు చేయాలి. అంటే ఓవర్ లోని ప్రతి బంతినీ సిక్సు కొట్టాలి. అలాంటి పరిస్థితుల్లో వరుసగా మూడు బంతులు సిక్స్ కు వెళ్లాయి. బ్యాట్స్ మెన్ ఊపు చూస్తుంటే బౌలర్ బేలగా మారిపోయిన తీరు చూస్తే మిగతా మూడు బంతులూ సిక్స్ లు అయ్యే అవకాశమే కనిపిస్తోంది. కానీ, అప్పుడే తలెత్తింది వివాదం. బ్యాట్స్ మన్ నడుము పైకి దూసుకొచ్చింది ఓ బంతి. అది నో బాలా? కానీ అంపైర్ నో బాల్ ఇవ్వలేదు.

పెద్ద వివాదం.. బ్యాటింగ్ జట్టు కెప్టెన్ తీవ్ర ఆగ్రహం.. మ్యాచ్ వదిలి వచ్చేయమని క్రీజులోని బ్యాట్స్ మన్ కు సూచన.. ఇంతలోనే వారి కోచ్ మైదానంలోకి వచ్చాడు. సర్దిచెప్పాడు. సమస్య సమసిపోయింది. కానీ, బ్యాట్స్ మన్ ఏకాగ్రత చెదిరింది. తర్వాతి బంతిని బౌండరీ దాటించలేకపోయాడు. మరుసటి బంతికి ఔటయ్యాడు. మ్యాచ్ వారి చేజారింది. ఇక్కడ విషయం అంపైర్ నిర్ణయం మీదకు మళ్లింది. అతడిపై తీవ్ర విమర్శలు రేగాయి. మోసగాడంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇదే నో బాల్ అంశం మరింత దుమారం రేపుతోంది.

హై డ్రామా.. హంగామా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో చోటుచేసుకున్న నో బాల్ వివాదం హైడ్రామా రేపింది. చివరి ఓవర్లో ఢిల్లీ గెలుపునకు 36 పరుగులు అవసరం కాగా.. రాజస్థాన్ బౌలర్ ఒబెద్ మెకాయ్ బౌలింగ్‌కు దిగాడు. ఢిల్లీ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్.. విరుచుకుపడుతుండడంతో మెకాయ్ లయ తప్పాడు. నాలుగో బంతి బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ నోబాల్‌గా ప్రకటించలేదు. డగౌట్లోని ఢిల్లీ జట్టు సభ్యులు నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు.

పావెల్ అంపైర్ వద్దకు వెళ్లి వాదించాడు. కానీ నితిన్ మీనన్ ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు. డగౌట్లో ఉన్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. పావెల్ వచ్చేసేయ్ అంటూ సైగచేశాడు. పావెల్, నాన్ స్ట్రయికర్ కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇంతలో షేన్ వాట్సన్.. పంత్‌ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. బంతి స్పష్టంగా నడుము పైకి వచ్చినట్లు కనిపించినా మీనన్ నో బాల్ ప్రకటించకపోవడంతో ప్రేక్షకులు సైతం అసహనానికి గురయ్యారు. స్క్రీన్లో చూశాక కూడా నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీటర్ చీటర్ అంటూ అరిచారు. సోషల్ మీడియాలో సైతం చీటర్ అనే ట్యాగ్‌ ట్రెండింగ్ అయింది. దారుణమైన మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.

మైదానంలోకి కోచ్ ఆమ్రే అసలు అది ఇంతకు నోబాల్ అవునో కాదో అనే విషయాన్ని బీసీసీఐ కానీ, ఐపీఎల్ మేనేజ్ మెంట్ కానీ స్పష్టత ఇవ్వలేదు. అయితే, అంపైర్ నిర్ణయానికి నిరసనగా బ్యాట్స్ మన్ వచ్చేసే సమయంలో ఢిల్లీ సహాయక కోచ్‌ ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వెళ్లి అంపైర్ తో మాట్లాడడం గమనార్హం. కాగా, పంత్‌, ప్రవీణ్‌ ఆమ్రె తీరుపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏమని అనుకుంటున్నారని చిందులు తొక్కాడు. ఆటలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయని, అంతమాత్రానా ఇలా స్పందించడం తగదని అన్నాడు. 'అది నోబాల్‌ ఇవ్వకపోవడంతో పంత్‌ కాస్త ఇబ్బందిగానే ఫీల్‌ అయి ఉండొచ్చు. కానీ, అంపైర్ల తీరు కన్నా.. నాకు దిల్లీ జట్టు వ్యవహరించిన తీరే ఆశ్చర్యం కలిగించింది.

రికీ పాంటింగ్‌ ఉంటే ఇలా జరిగేది కాదని అనుకుంటున్నా. ఆ సమయంలో బట్లర్‌.. పంత్‌తో మాట్లాడటం తప్పుకాదు. సహాయక కోచ్‌ను మైదానంలోకి పంపి ఏం చేద్దామనుకుంటున్నావ్‌? అది సరైన పద్ధతేనా? క్రికెట్ జెంటిల్‌మెన్‌ గేమ్‌. ఎవరైనా పొరపాట్లు చేస్తారు. క్రికెట్‌లో ఎన్నిసార్లు ఇలా జరగలేదు. ఔట్లు నాటౌట్లుగా, నాటౌట్లు ఔట్లుగా ఇంతకుముందు ఇవ్వలేదా? వాళ్ల గురించి వాళ్లేం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, ఇలా చేయడం మంచిదికాదు. ఆమ్రెను అలా మైదానంలోకి పంపడమే పెద్ద తప్పు. అతడిలాంటి పెద్ద మనిషి అలా వెళ్లి అంపైర్లతో మాట్లాడటం ఏంటో నాకర్థం కాలేదు. ఇది అస్సలు సహించరానిది. ఇలాంటివి మళ్లీ క్రికెట్‌లో నేను చూడాలనుకోట్లేదు' అని పీటర్సన్‌ మండిపడ్డాడు.