Begin typing your search above and press return to search.

దీక్ష చేసి ముద్రగడ సాధించిందేమిటి?

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:30 AM GMT
దీక్ష చేసి ముద్రగడ సాధించిందేమిటి?
X
దాదాపు నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసి.. కోట్లాది మందికి టెన్షన్ పుట్టించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ఏం సాధించింది? అన్న ప్రశ్న వేసుకుంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ఎందుకంటే ఆయన నాలుగు రోజులు దీక్ష చేసినప్పటికీ.. ఆయన సాధించిందేమిటన్నది ఒకపట్టాన అర్థం కాదు. ఎందుకంటే.. ఇప్పుడు పలువురు నోట వస్తున్న ప్రశ్నలేమిటంటే.. ముద్రగడ ఎందుకు దీక్ష చేసినట్లు? ఎందుకు విరమించినట్లు? అని. ఎందుకంటే.. మొదట్నించి ఏపీ సర్కారు ఏం చెప్పిందో అదే విషయాన్ని చివరి రోజున చెప్పిందే తప్పించి మరెలాంటి ప్రత్యేక హామీ ఇవ్వలేదు. కాకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కాపు కార్పొరేషన్ కు రూ.500కోట్లు.. వచ్చే బడ్జెట్ లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్న హామీ ఒక్కటే కనిపిస్తుంది.

కాపుల్ని బీసీల్లోకి చేర్చే మంజునాథ కమిషన్ గడువును తగ్గించింది కూడా లేదు. నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ దీక్ష చేయటం.. విరమించటం కారణంగా కాపులకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ముద్రగడ.. తాను దీక్ష చేయకపోతే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే దీక్ష చేపట్టినట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో ప్రభుత్వం జీవో జారీ చేయాలన్న డిమాండ్ లో పస లేదని.. అది ఆచరణ సాధ్యం కాదన్న విషయాన్ని నిపుణులు స్పష్టం చేయటంతో తాను దీక్ష చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదన్న విషయం ముద్రగడకు అర్థమైందని చెబుతున్నారు. కాపులను బీసీల్లోకి చేర్చాలంటే ప్రభుత్వం కంటే కూడా బీసీ కమీషన్ నిర్ణయం తీసుకోవాలన్న విషయంపై ముద్రగడకు సాంకేతిక అంశాల్ని ఏపీ మంత్రులు అర్థమయ్యేలా చెప్పటంలో సక్సెస్ కావటంతో ఆయన మరో మాట మాట్లాడకుండా దీక్షను విరమించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీక్ష చేసే ముందే ఇలాంటి అంశాల మీద ముద్రగడ అధ్యయనం చేసి ఉంటే ఇప్పుడు ఆయనపై ప్రశ్నలు రేకెత్తే అవకాశం ఉండేది కాదు.