Begin typing your search above and press return to search.

ఎందుకొచ్చిన ప‌ర్య‌ట‌న‌లు క‌న్నా...!

By:  Tupaki Desk   |   7 July 2018 11:59 AM GMT
ఎందుకొచ్చిన ప‌ర్య‌ట‌న‌లు క‌న్నా...!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్రదేశ్ శాఖ అధ్య‌క్షుడి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అన్నీ అప‌శ‌కునాలే. నిజానికి ఆయ‌న‌కి అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌పెట్టాల‌నుకున్న‌ప్పుడే పార్టీలో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కూడా ఏమంత ఆనందంగా జ‌ర‌గ‌లేదు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో అంట‌కాగి ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు కారాలు - మిరియాలు నూరుకుంటున్న వైనాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. త‌న హ‌యాంలో పార్టీని న‌డిపించాల‌ని, అధికారం వైపు తీసుకెళ్లాల‌ని క‌ల‌లు కంటున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఆది నుంచి చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. తొట్ట తొలి ప‌ర్య‌ట‌న‌గా అనంత‌పురం వెళ్లిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను స్ధానిక తెలుగుదేశం నాయ‌కులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వ‌ర్గాల‌కు మ‌ధ్య ర‌ణ‌రంగ‌మే జ‌రిగింది. ఒక‌రిపై ఒక‌రు కేసులు సైతం పెట్టుకున్నారు. ఇది ఆ రెండు పార్టీల మ‌ధ్య చిచ్చుకు నాందీ వాచ‌కం అయ్యింది.

ఇక ఆ త‌ర్వాత నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అక్క‌డ కూడా చేదు గుళిక‌లే ఎదుర‌య్యాయి. అనంత‌పురంలో ఆయ‌న‌పై దాడికి ప్ర‌య‌త్నిస్తే నెల్లూరు జిల్లాలో ఏకంగా దాడే చేశారు. కావ‌లి పుర‌వీధుల్లో క‌మ‌ల‌నాధుల‌తో క‌లిసి ర్యాలీగా వెళుతున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై ఒక‌రు ఏకంగా చెప్పే విసిరారు. అత‌డ్ని బిబెపి కార్య‌క‌ర్త‌లు దేశ‌శుద్ధి కూడా చేశారు. ఇలా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎక్క‌డికి వెళితే అక్క‌డ ఎదురుదాడులే స్వాగ‌తం ప‌లుకుతున్నాయి.

తాజాగా శ‌నివారం నాడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న కూడా అలాగే తుస్సుమంది. అయితే ఈ సారి దాడి చేసింది తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కాదు. అలాగ‌ని ఇది దాడీ కాదు.. ఓ పెద్ద అవ‌మానం. పార్టీ అధ్య‌క్షుడిగా తొలిసారి క‌డ‌ప జిల్లాకు వెళ్లిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వారి పార్టీ దైవం శ్రీరామ‌చంద్రుడ్ని ద‌ర్శించుకోవాల‌నుకున్నారు. తెలంగాణ‌కు భ‌ద్రాచ‌లం ఎలాగో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఒంటిమిట్టకు ఎంతో విశిష్టత ఉంది. అలాంటి ఒంటిమిట్ట రాముడి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకున్న బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడికి చేదు అనుభ‌వం ఎదురైంది. ఒంటిమిట్ట‌కు కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అస‌లు విష‌యం తెలిసింది. అదేమిటంటే త‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు బిజెపి కార్య‌క‌ర్త‌లెవ‌రూ ఒంటిమిట్ట రాలేద‌ని. అంతే క‌న్నా వారు కంగుతిన్నారు. త‌న కాన్వాయ్ వెంట ఉన్న బస్సు కేవ‌లం డ్రైవ‌ర్‌ తోనే వ‌స్తోంది త‌ప్ప అందులో ఒక్క‌రంటే ఒక్క బిజెపీ కార్య‌క‌ర్త కూడా లేరు. ఈ చేదు నిజాన్ని తెలుసుకున్న క‌న్నా లక్ష్మీనారాయ‌ణ త‌న ఒంటిమిట్ట ప‌ర్య‌ట‌న‌ను అర్ధాంత‌రంగా విర‌మించుకుని నేరుగా క‌డ‌ప వెళ్లిపోయారు. త‌మ అధ్య‌క్షుడికి వ‌రుస అవ‌మానాలు ఎదురవుతూంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌కు - కార్య‌క‌ర్త‌లకు చాలా అవ‌మానంగా ఉంద‌ని పార్టీలో కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు. క‌న్నా.... నువ్వు వ‌చ్చాక ఇలా జ‌రుగుతోందేమిటి క‌న్నా... అని క‌మ‌ల‌నాథులు చ‌ర్చించుకుంటున్నారట‌.