Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల‌కు భారీ హ్యాండిచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   1 Feb 2018 8:07 AM GMT
తెలుగోళ్ల‌కు భారీ హ్యాండిచ్చిన మోడీ
X
ఒక గంటా న‌ల‌భైఏడు నిమిషాలు. మ‌రింత క్లారిటీగా చెప్పాలంటే.. 107 నిమిషాల పాటు సాగిన కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ ప్ర‌సంగాన్ని శ్ర‌ద్ధ‌గా విన్న ప్ర‌తి తెలుగోడికి ఒళ్లు మండేలా చేయ‌టం ఖాయం. నాలుగేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు అర‌కొర బ‌డ్జెట్ కేటాయింపులు చేస్తున్న మోడీ స‌ర్కారు.. తాజా బ‌డ్జెట్ లో అయినా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతోకొంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని.. దీర్ఘ‌కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల‌కు భారీగా నిధులు కేటాయిస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఏపీ విష‌యానికి వ‌స్తే ఆ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి.. ఆ రాష్ట్రం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు.. విశాఖ రైల్వే జోన్‌.. విభ‌జ‌న కార‌ణంగా ఆర్థికంగా చితికిపోయిన ఏపీకి ఏదో ఒక భ‌రోసా ఇస్తార‌న్న ఆశ‌ను పెట్టుకున్నారు. అదే స‌మ‌యంలో విభ‌జ‌న‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ప్ర‌ధాన‌మైన‌వి వాటికి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి నిధులు ద‌క్క‌లేదు. అన్నింటికి మించిన తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠ‌గా తీసుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ఎంతోకొంత నిధులు ఇస్తార‌న్న ఆశ‌లు ఆడియాశ‌లు అయ్యాయి.

బ‌డ్జెట్ ప్ర‌సంగ పాఠంలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు పూర్తిస్థాయిలో మొండిచేయి చూపారు జైట్లీ. మ‌రి.. బ‌డ్జెట్ పూర్తి పాఠం చూస్తే.. అర‌కొర చిల్ల‌ర కేటాయింపులు ఏమైనా చేశారేమో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఎలాంటి భారీ కేటాయింపులు కేటాయించ‌ని మోడీ స‌ర్కారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు పెద్ద పీట వేశారు. మ‌రికొద్ది నెల‌ల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొని బెంగ‌ళూరు మెట్రోకు ఏకంగా రూ.18వేల కోట్ల‌ను కేటాయించ‌టం చూస్తూ.. మోడీలో గుజ‌రాతీ వ్యాపారి కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.

నాకు లాభం వ‌స్తే నేనేమైనా చేస్తా. నాకు లాభం రాన‌ప్పుడు ఎందుకు ఖ‌ర్చు చేయాల‌న్న‌ట్లుగా మోడీ తీరు ఉంద‌ని చెప్పాలి. బెంగ‌ళూరు మెట్రోకు భారీ ఎత్తున నిధులు కేటాయించ‌టం ద్వారా రానున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌యోజ‌నాన్ని ఆశిస్తున్న‌ట్లుగా చెప్పాలి. హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టు మొత్తం ఖ‌ర్చే రూ.15వేల కోట్లు. అలాంటిది ఇప్ప‌టికే ఉన్న బెంగ‌ళూరు మెట్రోకు అద‌నంగా రూ.18వేల కోట్లు కేటాయించ‌టం అంటే క‌ర్ణాట‌క రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగుర‌వేయ‌టానికి ఎంత ఖ‌ర్చుకైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా మోడీ స‌ర్కారు తీరు ఉంద‌ని చెప్పాలి.

ప్ర‌స్తుతం మిత్ర‌ప‌క్షం శివ‌సేన‌తో క‌లిపి మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. రానున్న ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే అవ‌కాశం ఉంది.ఈ కార‌ణంతోనే కావొచ్చు.. మ‌హారాష్ట్ర మీద విప‌రీత‌మైన ప్రేమ‌ను ఒల‌క‌బోసింది మోడీ స‌ర్కారు. ముంబ‌యి స‌బ‌ర్బ‌న్‌కు ఏకంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించ‌టం చూస్తే.. మోడీ ప్ర‌భుత్వ ప్రాధామ్యాలు ఏమిట‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. త‌న‌కు అధికారం ఇస్తే అక్కున చేర్చుకోవ‌టం.. అధికారం ఇవ్వ‌ని రాష్ట్రాల ప‌ట్ల చిన్న‌చూపు చూడ‌టం.. చుల‌క‌న‌భావం ప్ర‌ద‌ర్శించ‌టం మోడీకి అల‌వాటుగా మారింది. కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వాలు ఏవి ఉన్నా. ఏదో విధంగా తెలుగు రాష్ట్రాల మీద చిన్న‌చూపు చూస్తుంటార‌న్న విమ‌ర్శ ఉంది. మోడీ స‌ర్కారు విష‌యంలో ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పాలి. అందుకే.. తెలుగోడు ఎవ‌రైనా స‌రే.. మోడీకి ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌కూడ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. అంతేకాదు.. తెలుగోళ్ల ప‌ట్ల మోడీ ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్యంపై తెలుగు ప్ర‌జ‌లు త‌మ‌కే మాత్రం అవ‌కాశం వ‌చ్చినా నిర‌స‌న వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఏమైనా.. కేంద్రం త‌మ ప‌ట్ల ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న భావ‌న‌తో ఉన్న తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల్ని జైట్లీ బ‌డ్జెట్ మ‌రింత ఒళ్లు మండేలా చేసింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.