Begin typing your search above and press return to search.

రాహుల్‌..లోకేష్‌ లాగా తాను కాదంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   5 Nov 2017 6:05 AM GMT
రాహుల్‌..లోకేష్‌ లాగా తాను కాదంటున్న కేటీఆర్‌
X
రాష్ట్రం ఏదైన‌ప్ప‌టికీ...దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు అత్యంత స‌హ‌జ‌మైపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జంగానే ఒక యువ‌నేత‌తో...మ‌రో యువ నాయ‌కుడికి పోలిక‌లు తెర‌మీద‌కు వ‌స్తాయి. దేశ రాజ‌కీయాల్లో ముఖ్యనేత‌లుగా ఉన్న‌వారి త‌న‌యుల విష‌యంలో ఈ త‌ర‌హా ప్ర‌స్తావ‌న స‌హ‌జంగానే ఉంటుంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం త‌న‌ను ఇలాంటి పోలిక‌ల్లో ఇమ‌డ్చ‌వ‌ద్దంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ త‌న‌ను క‌లిసిన‌ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారసత్వ నాయకత్వంపై స్పందిస్తూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో తనను ముడిపెట్టొద్దని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆ పార్టీ యువ‌నేత‌ రాహుల్‌గాంధీ, తెలుగుదేశం పార్టీ లోకేశ్‌ ఆధీనంలో ఉన్నట్టుగా టీఆర్ఎస్ మీ క‌న‌సున్న‌ల్లో ఉందికదా అన్న ప్రశ్నకు కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ.. 'మా(టీఆర్‌ఎస్‌) పార్టీ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల్లోనే ఉంది` అంటూ నవ్వారు. పైగా వారసత్వ రాజకీయాల్లో రాహుల్‌గాంధీతో, లోకేశ్‌తో తనను ముడిపెట్టొద్దని అన్నారు. ఒకరి కొడుకు, కూతురు అనేది కేవలం ఎంట్రీ పాస్ వరకే పనికొస్తుందని కేటీఆర్ తెలిపారు. ``రాజ‌కీయాల్లో సామర్థ్యమే గీటురాయి. సిరిసిల్లలో మూడుసార్లు గెలిచాను. నా పనితీరు బాగా లేకుంటే ఫలితం వేరేలా ఉండేది క‌దా?`` అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్‌.. తెలంగాణ, ఆంధ్రలో బీజేపీకి బ‌ల‌మేమీ లేదని అన్నారు. ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు తెలంగాణను వదిలేసినట్టు ఉందిగా అన్న ప్రశ్నకు స్పందిస్తూ..``వాళ్లకు తెలంగాణలో ఏమైనా ఉంటే కదా వదిలేయడానికి. కర్నాటకలో ఒకప్పుడు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఏపీ, తెలంగాణలో బీజేపీకి ఏమీ లేదు`` అని తెలిపారు.