Begin typing your search above and press return to search.

అక్కడ బీజేపీకి అంత సీన్ లేదా?

By:  Tupaki Desk   |   2 Oct 2018 10:26 AM GMT
అక్కడ బీజేపీకి అంత సీన్ లేదా?
X
తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో బీజేపీకి నాయకుల కొరత వేధిస్తోందట.. పార్టీ జెండా మోసే వారి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దేశమంతా తమ హవా ఇప్పుడు నడుస్తుందని, బీజేపీ వస్తే అచ్ఛేదిన్ వస్తాయని దేశం మొత్తం ప్రచారం చేస్తున్నా, తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు రావడం లేదట. కానీ నాయకుల్లో మాత్రం ధీమా తగ్గడం లేదు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణాలో అన్ని సీట్లు గెలుచేకుంటామంటూ ఇటీవల జరిగిన సంకల్ప్ సభలో అమిత్ షా ప్రకటించి, ప్రత్యర్థి పార్టీలకు సవాల్ చేసి వెళ్లారు.

ఆ సభలో డీఎస్ కుమారుడు అరవింద్ తో పాటు మరో ముగ్గురు నేతలు చేరారు. ఎన్నికల వేళ ఇక వలసలు కొనసాగుతాయని భావించారు. కానీ ఆశించిన మేర ఫలితం కనబడకపోవడంతో అసహనం చెందుతున్నారు కమలనాధులు. ఈ విషయమై బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలపై మండిపడినట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాలని హుకూం జారీ చేశారు. అయినా, ఎవరూ మచ్చుకు ముందుకు రావడం లేదు.

చాలా మంది టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో ఎప్పుడో చేరిపోయారు. ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బ పడింది. సంకల్ప్ సభ పెట్టి ఊదరగొట్టినా ఎవరూ ఆకర్షణకు గురవలేదు. దాంతో పోరులో నిలిపేందుకు అభ్యర్థుల వేట మొదలుపెట్టింది బీజేపీ. అంసత‌ృప్తులపై ప్రధానంగా కన్నేశారు. ఎవరూ ఏ పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్నారో వారిని దగ్గరకు తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్న ఒక్కరిద్దరు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు నియోజవర్గాల్లో ఒక్క కామారెడ్డి అభ్యర్థిత్వంపైనే స్పష్టత వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ను వీడి కాషాయా కండువా కప్పుకున్న మాజీ జడ్పీ చైర్మన్ కాటపల్లి వెంటకరమణారెడ్డికి టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ పెద్దలు ఉన్నారట. ఇక ఎల్లారెడ్డి నియోజవకర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే, బీజేపీ అధిష్ఠానం మాత్రం టీఆర్ఎస్ అసమ్మతి నేత జి జనార్థన్ గౌడ్ తో సంప్రదింపులు చేస్తున్నారట. సమయం వచ్చినప్పుడు బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. బాన్సువాడ లో అసలు పోటీ చేసేందుకు ఎవ్వరూ కనబడటం లేదట. అసలు పార్టీ జెండా కట్టేవారు లేకపోవడంతో నిజామాబాద్ కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకొడొకడిని బరిలో దించేందుకు యోచిస్తున్నారట. జుక్కల్ లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందట. ఇటీవల టీడీపీ నుంచి వినయ్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనను టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బీజేపీ శ్రేణులు.

ఒక్క నిజామాబాద్ అర్బన్ కు మాత్రమే బీజేపీ నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. 2014లో పోటీ చేసి ఓటమి పాలైన ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఈ సారి కూడా టిక్కెట్ తనకే ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే బస్వ లక్ష్మీనరసయ్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. మరో వైపు ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్న డీఎస్ తనయుడు అరవింద్ సీటు అడుగుతున్నా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ముందు బలం నిరూపించుకోవాలని సూచిస్తుందట బీజేపీ అధిష్ఠానం. దాంతో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆయన.

మొత్తంమీద బీజేపీకి అసంతృప్తులు - ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే పరువు నిలబెట్టేందుకు దిక్కుగా మారారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంతవరకు తన సత్తా చాటుతుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.