Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గంలో కేటీఆర్ కు నో ఛాన్స్!

By:  Tupaki Desk   |   11 Jan 2019 5:27 AM GMT
మంత్రివ‌ర్గంలో కేటీఆర్ కు నో ఛాన్స్!
X
నిదానం ప్రదానం అన్న సూత్రం మంచిదే అయినా.. ఆల‌స్యం అమృతం విష‌మ‌న్న సామెత కూడా ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కొన్ని విష‌యాల్లో ఎక్కువ కాలం తీసుకోవ‌టం అంత మంచిది కాదు. అన‌వ‌స‌ర‌మైన చ‌ర్చ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లుగా అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఇవ‌న్నీ తెలియ‌ని విష‌యాలు కావు. కానీ.. తానేం అనుకున్నానో.. అది మాత్ర‌మే చేసే అల‌వాటున్న ఆయ‌న మిగిలిన విష‌యాల్ని అస్స‌లు ప‌ట్టించుకోరు.

బ‌య‌ట‌కు వంద ప్ల‌స్ సీట్లు వ‌స్తాయ‌ని చెప్పినా.. లోప‌ల మాత్రం 70 ప్ల‌స్ వ‌స్తేనే గొప్ప‌న్న‌ట్లుగా కేసీఆర్ క్యాంప్ లెక్క‌లు వేసుకున్న ప‌రిస్థితి.అలాంటిది ఏకంగా వంద వ‌ర‌కూ సీట్లు రావ‌టం కేసీఆర్ లో కాన్ఫిడెన్స్ ఎంత పెంచిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నిక‌ల వేళ‌లో ఆయ‌న మైండ్ సెట్ కు.. ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత ఆయ‌న తీరులో చాలా మార్పు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో త‌న‌పై ఏ అంశాల్ని చూపించి ప్ర‌త్య‌ర్థులు గురి పెట్టారో.. వాటిల్లో కొన్నింటి మీద ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు.

పీడ దినాలు కానీ.. మ‌రో కార‌ణం కానీ కేబినెట్ తో స‌హా ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం కూడా కాని వేళ‌.. ఎవ‌రికి ప‌ద‌వులు వ‌స్తాయో.. ఎవ‌రికి మొండి చేయి మిగులుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. కేసీఆర్‌ ది చిత్ర‌మైన మ‌న‌స్త‌త్వం. భోళాగా ఉన్న‌ట్లు క‌నిపిస్తూనే.. ఎవ‌రూ కొల‌వ‌లేనంత లోతు ఆయ‌న‌లో ఉంటుందంటారు. ఇంటికి పిలిచిన అతిధి జీవితంలో మ‌ర్చిపోలేని రీతిలో విందు ఇచ్చే ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ఎవ‌రో తెలీన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి ఆయ‌న‌కు మాత్ర‌మే సొంతం. అంటే.. ఒకే మ‌నిషిలో ఏ మాత్రం సంబంధం లేని రెండు వేరియ‌ష‌న్ల‌కు నిలువెత్తు ప్ర‌తీక కేసీఆర్‌ గా చెప్పాలి.

ఇలాంటి తీరుతో ఎవ‌రిని ఎప్పుడు అంద‌లం ఎక్కిస్తారో.. ఎవ‌రిని పాతాళానికి తొక్కేస్తార‌న్న విష‌యంపై ఆయ‌న‌కు మాత్ర‌మే క్లారిటీ ఉంటుంద‌ని చెబుతారు. ఇలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న కేసీఆర్‌.. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా.. కొన‌ని విష‌యాల వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి మాత్రం త‌న లెక్క‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారే కానీ.. ఇంకేవీ ఆయ‌న‌కు ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటార‌ని చెబుతారు. కేసీఆర్ లో ఉండే ఈ త‌ర‌హా మైండ్ సెట్ కూడా తాజాగా వినిపిస్తున్న అనేక వాద‌న‌ల‌కు కార‌ణాలుగా చెప్పాలి.

తెలంగాణ‌లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో.. అందునా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో న‌డుస్తున్న హాట్ టాపిక్ .. మంత్రివ‌ర్గంలో ఎవ‌రు ఉంటార‌న్న‌ది. తోపుల్లాంటి సీనియ‌ర్ల‌కు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ మంత్రి ప‌ద‌వుల‌కు సంబంధించిన చిన్న ఇండికేష‌న్ రాలేదు. దీంతో.. కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. బ‌య‌టోళ్ల‌కు ఏంటి? ఇంట్లో వాళ్ల‌కు.. అందునా కొడుక్కి కూడా మంత్రివ‌ర్గంలో చోటు ఉండ‌ద‌న్న ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

కొడుకంటే ప్రాణంగా.. ఆయ‌నకు ప‌ట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ త‌పిస్తార‌ని చెబుతున్నా.. అదంతా ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో.. తాను అనుకున్న‌ట్లుగా జ‌ర‌గాలంటే ముందు కొన్ని సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతారు. త‌న మీద ప‌డిన కుటుంబ ముద్ర‌ను చెరిపేసుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా ఆయ‌న కేటీఆర్‌ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కేటీఆర్‌ ను ప్ర‌భుత్వంలోకి తీసుకునే క‌న్నా.. పార్టీకే ప‌రిమితం చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా స‌మాచారం.
త‌న రాజ‌కీయ వార‌సుడిగా కేటీఆర్ ను త‌యారు చేస్తున్న కేసీఆర్‌.. అందులో భాగంగా ఈసారి మంత్రి ప‌ద‌వి కంటే కూడా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌పెట్టాల‌న్న దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మంత్రివ‌ర్గంలోకి తీసుకోకుండా.. త‌న‌కు కొడుకంటే ఎలాంటి బ‌ల‌హీన‌త లేద‌న్న విష‌యాన్నిత‌న నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేసి.. మంచి టైం చూసుకొని ఏకంగా ప‌ట్టాభిషేకం చేస్తార‌న్న మాట వినిపిస్తోంది. అనూహ్య నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే కేసీఆర్‌.. త‌న కొడుకు విష‌యంలో అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.