Begin typing your search above and press return to search.

మాక్ పోలింగ్ కే 18 గంట‌లు.. మ‌రి పోలింగ్ ఎలా?

By:  Tupaki Desk   |   4 April 2019 5:01 AM GMT
మాక్ పోలింగ్ కే 18 గంట‌లు.. మ‌రి పోలింగ్ ఎలా?
X
తొలి ద‌శ పోలింగ్‌ కు సంబంధించి యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోంది నిజామాబాద్ ఎంపీ స్థానం పోటీ. సినిమాల్లో మాదిరి త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌సుపు.. ఎర్ర జొన్న రైతులు పెద్ద ఎత్తున ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టంతో ఇక్క‌డ 185 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. దీంతో.. ఇక్క‌డ ఎన్నిక‌ను నిర్వ‌హించే విష‌యంలో ఎన్నిక‌ల సంఘానికి పెద్ద ఎత్తున స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

ప్ర‌తి విష‌యంలోనూ ఈసీ బుర్ర ప‌గిలిపోయేలా ఆలోచించ‌ట‌మే కాదు.. తెలంగాణ మొత్తంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం ఒక ఎత్తు.. నిజామాబాద్ లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం మ‌రో ఎత్తు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. తొలుత పోలింగ్ ను వాయిదా వేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగినా.. త‌ర్వాత ఈసీ మాత్రం ఎన్నిక నిర్వ‌హించేందుకే మొగ్గు చూపింది. 185 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిల‌వ‌టంతో ఈవీఎంల‌తో కాదు.. బ్యాలెట్ తో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తార‌న్న వాద‌న వినిపించినా.. చివ‌ర‌కు ఈవీఎంల‌తో ఎన్నిక నిర్వ‌హించాల‌ని డిసైడ్ చేశారు.

తాజాగా ఎన్నిక‌ను నిర్వ‌హించ‌టానికి వీలుగా పెద్ద ఎత్తున ఇంజినీర్ల‌ను.. ఎన్నిక‌ల అధికారుల్ని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొహ‌రించారు. పోలింగ్ ఏర్పాట్ల‌ను స‌మీక్షిస్తున్నారు. దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల‌ను అందుబాటులోకి తెస్తున్నారు. యూ ఆకారంలో ఈవీఎంల‌ను ఉంచి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.

రూల్ బుక్ ప్ర‌కారం ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ కు ముందు ఉద‌యం 6 గంట‌ల‌కు మాక్ పోలింగ్ నిర్వ‌హించ‌టం.. త‌ర్వాత 7 గంట‌ల నుంచి పోలింగ్ నిర్వ‌హించ‌టం చేస్తుంటారు. కానీ.. నిజామాబాద్ పోలింగ్ విష‌యంలో అది సాధ్యం కాద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. మాక్ పోల్ లో ఒక్కో అభ్య‌ర్థికి సుమారు 50 ఓట్లు వేసి ప‌రిశీలిస్తారు. ఒక్కో ఓటుకు వీవీ ప్యాట్ నుంచి 7 సెక‌న్ల‌కు స్లిప్పు వ‌స్తుంది. ఒక్కో అభ్య‌ర్థికి ఒక్కో ఓటు వేసినా 185 మంది అభ్య‌ర్థుల‌కు 22 నిమిషాల టైం ప‌డుతుంది. అలాంటిది ఒక్కో అభ్య‌ర్థికి 50 ఓట్ల చొప్పున వేసి ప‌రిశీలించాల‌నుకుంటే.. అందుకు ఏకంగా 18 గంట‌ల టైం ప‌డుతుంది.

మాక్ పోలింగ్ కే 18 గంట‌లైతే.. మిగిలిన పోలింగ్ మాటేమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. రూల్ బుక్ లో ప్ర‌కారం మాక్ పోలింగ్ నిర్వ‌హిస్తారా? నిజామాబాద్ ఎంపీ పోలింగ్ ను ప్ర‌త్యేక‌మైన కేసుగా ప‌రిగ‌ణించి.. మాక్ పోలింగ్ ను మిన‌హాయిస్తారా? మ‌రేదైనా ఏర్పాటు చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.