Begin typing your search above and press return to search.

ఆ విధంగా వైరస్ సోకే అవకాశం లేదట!

By:  Tupaki Desk   |   22 May 2020 6:45 AM GMT
ఆ విధంగా వైరస్ సోకే అవకాశం లేదట!
X
ఒకే ఒక వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఆధునికంగా , సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాము అని గొప్పలు చెప్పుకుంటున్న ఎన్నో దేశాలు సైతం ఈ మహమ్మారి దెబ్బకి మట్టికరుచుకుపోయాయి. దీన్ని అరికట్టడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపుగా ఆరు నెలలు కావొస్తుంది అయినప్పటికీ దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. అయితే, ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటికీ నుండి వినిపిస్తున్న ఒకే ఒక మాట ఈ వైరస్ సోకిన వారు తాకిన ఏ వస్తువు మనం తాకినా మనకి ఈ వైరస్ వస్తుంది అని, అలాగే కరెన్సీ ద్వారా కరోనా వస్తుందన్న వదంతులు తెగ ప్రచారం అయ్యాయి.

అయితే , ఈ వందుతులన్నీ కూడా అబద్దాలే అని ఆమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) తోసిపుచ్చింది. వైరస్ వ్యాధిగ్రస్తులు తాకిన వస్తువులు లేదా పరిసరాలను ముట్టుకుంటే వైరస్ వస్తుందన్న వదంతులు నిజం కాదని తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమాన ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయన నివేదిక అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ప్రచురించింది. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తితో నేరుగా కలవడం, వారి ద్వారా వచ్చిన ఇతరులను కలవడం, వారి పక్కనే ఉండటం వల్ల వస్తుందని తెలిపింది.

అంతే తప్ప పాజిటివ్‌ వ్యక్తి పట్టుకున్న వస్తువులను, ఉపరితలాలను తాకడం వల్ల కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు దొరకలేదని సీడీసీ తేల్చిచెప్పింది. అలా అని అలసత్వం పనికిరాదు అని , క్లీన్ గా ఉండాలని తెలిపింది. అయితే మార్చిలో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదికలో.. పరిసరాలను తాకడం వల్ల రావొచ్చని పేర్కొంది. ఇప్పుడు మాత్రం పరిసరాలు, వస్తువులను తాకడం వల్ల అంత సులభంగా రాదని తాజా అధ్యయనంలో తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అలా వచ్చిన లక్షలాది కేసులన్నింటినీ అధ్యయనం చేసి ఈ నివేదిక ఇచ్చినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర దేశాల్లో వచ్చిన కేసులను కూడా సీడీసీ అధ్యయనం చేసినట్లు నిపుణులు అంచనా వేశారు.

పాజిటివ్‌ ఉన్న వ్యక్తికి 6 అడుగుల కంటే దగ్గరగా ఉండటం - వారితో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వ్యాపిస్తుంది. అలాగే ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే - ఎక్కువ శాతం కరోనా కేసులు కుటుంబాల్లోనే వెలుగు చూశాయి. దీనితో ప్రతి ఒక్కరు ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని - మాస్క్ ‌ను తప్పనిసరిగా ధరించాలని సీడీసీ స్పష్టం చేసింది. మొత్తంగా ఇప్పుడు సీడీసీ ఇచ్చిన నివేదికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.