Begin typing your search above and press return to search.

సొంత ఎంపీకి వేషాల్లేకుండా చేసిన బాబు

By:  Tupaki Desk   |   29 Jan 2017 9:38 AM GMT
సొంత ఎంపీకి వేషాల్లేకుండా చేసిన బాబు
X
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం వీర లెవల్లో జరిగినప్పుడు కొంతమంది ఎంపీలు తెలుగువారి దృష్టిని విపరీతంగా ఆకర్షించారు. నిజానికి వారి పేర్లు అప్పటి వరకూ పెద్ద ఫేమస్ కాకున్నా.. వారి చేష్టల కారణంగా ఫేమస్అయిపోయారు. అప్పటివరకూ.. లగడపాటి.. కావూరి.. రాయపాటి.. ఇలాంటి పేర్లు తప్పించి.. టీడీపీ ఎంపీ శివప్రసాద్ తెలుగువారికి పెద్దగా పరిచయం లేదని చెప్పాలి.

చిత్తూరు జిల్లా నేతగా పరిచయం ఉన్నా.. ఆయన ఇమేజ్ మాత్రం కాస్త పరిమితమైందనే చెప్పాలి. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో విభజనను వ్యతిరేకిస్తూ ఆయన వేసిన వేషాలు అన్నిఇన్ని కావు. రోజుకోవేషం వేసుకొచ్చి.. ఆంధ్రోళ్ల బతుకులపై ఆయనతనదైన శైలిలో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన వేసిన వేషాలు విడిగా ఏమైనా ఉపయోగపడ్డాయో లేదో కానీ.. ఉద్యమ సమయంలో ఏపీ వాయిస్ ను వినిపించేందుకు ఆయన వేషాలు అందరి మదిలో ప్రింట్ కావటమేకాదు.. 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా మరోసారి గెలిచేందుకు అవకాశాన్ని కల్పించాయని చెప్పాలి.

విభజన తర్వాత.. శివప్రసాద్ కు వేషాలు వేసే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమైంది. అయితే.. హోదా పుణ్యమా అని.. ఆయన తనలోని కళాకారుడ్ని హోదా కోసం నిర్వహించే నిరసనల్లో భాగంగా బయటకు తీసుకొచ్చేవారు. పార్లమెంటు సమావేశాలు జరిగే ప్రతిసారీ.. రోజుకో వేషం వేస్తూ మీడియాలో కనిపించేవారు. కొన్నిసార్లు ఆయన వేషాలు కాసింత కామెడీగా ఉన్నా.. హోదా కోసం ఆయన సిన్సియర్ గా ఎఫెర్ట్ చేస్తారన్న మాటను చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. హోదా ఇష్యూ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా వెనకడుగు వేయటం తలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కేంద్రమంత్రి సుజనా చౌదరి అయితే.. హోదా అన్నది ముగిసిన అధ్యాయంగా చెప్పేశారు కూడా. మరి.. ఇలాంటివేళ..చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే చాలు.. హోదా అంశాల్ని తేల్చాలంటూ కేంద్రం తీరుపై నిరసనతో వేషాలు వేసే శివప్రసాద్ కు.. చంద్రబాబు తాజాగా వైఖరితో వేషాలు పోయినట్లేనని చెప్పక తప్పదు. హోదా మీద బాబు వెనకడుగు ఏమో కానీ.. టీడీపీ ఎంపీకి మాత్రం వేషాలు వేసే ఛాన్సులుపెద్ద ఎత్తున పోయాయని చెప్పక తప్పదు. అధినేత మైండ్ సెట్ కు తగ్గట్లే ఎంపీ శివప్రసాద్ తాను వేసే నిరసన వేషాల్ని వదిలేస్తారా? లేక కంటిన్యూ చేస్తారా? అన్నది బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/