Begin typing your search above and press return to search.

ద‌త్త‌న్నకు గ‌వ‌ర్న‌ర్ గిరీ..అబ్బే అయ్యే ప‌ని కాదు

By:  Tupaki Desk   |   6 Sep 2017 12:30 AM GMT
ద‌త్త‌న్నకు గ‌వ‌ర్న‌ర్ గిరీ..అబ్బే అయ్యే ప‌ని కాదు
X
జాతీయ స్థాయిలో దాదాపుగా ఏక‌ఛత్రాదిప‌త్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్న బీజేపీ ఏలుబ‌డిలో తెలుగు రాష్ర్టాల‌కు ద‌క్కుతున్న గౌర‌వంపై కొత్త చర్చ మొద‌లైంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీ స‌ర్కారు ముచ్చ‌ట‌గా మూడోసారి చేసిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో తెలుగు రాష్ర్టాలు షాక్ తిన్న సంగ‌తి తెలిసిదే. తాజా కేబినెట్‌ విస్తరణలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ తరఫున తెలుగు మంత్రులు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఏపీ నుంచి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం - తెలంగాణ నుంచి పెద్ద దిక్కుగా ఉన్న బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలికారు. బీజేపీ ఎంపీ హ‌రిబాబును ఢిల్లీ వ‌ర‌కు పిలిపించిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో మొండి చేయి చూపించారు. దీంతో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి మినహా ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మంత్రులు లేకుండా అయ్యారు.

2019 ఎలక్షన్‌ అంటూ నలుగురు బ్యూరోక్రాట్లు సహా మొత్తం 9 కొత్త ముఖాలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి, ఆరుగురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో చోటు కోల్పోయిన ఈ మాజీ మంత్రుల్లో కొందరికి పార్టీలో పదోన్నతి కల్పించి - కొత్త బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే రాజీనామా చేసిన అందరికీ పదవులు దక్కే అవకాశం లేదని చెప్తున్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ - మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు గవర్నర్‌ పదవి ఇప్పట్లో లేదని తెలుస్తోంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ఉద్వాసనకు గురైన ఆయనకు గవర్నర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న‌ప్ప‌టికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇందుకు ఇద్దరూ లోక్‌ సభ ఎంపీలు కావడమే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలకు ఫుల్‌ టైం గవర్నర్లు లేరు. వాటిలో ఎక్కడైనా వీరిద్దరినీ సర్దుబాటు చేయాలంటే కొత్త చిక్కు వచ్చి పడుతోంది. లోక్‌ సభ ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరికీ గవర్నర్‌ పదవులిస్తే వారి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచాల్సి వస్తుంది. ఇందుకు అమిత్‌ షా సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే వాటి ప్రభావం పార్టీపై ప్రతికూలంగా ఉంటుందనేది ఆయన భావన. అందుకే ఈ నేతలిద్దరినీ ఇప్పటికిప్పుడు గవర్నర్లుగా చేసే బదులు, లోక్‌సభ పదవీకాలం పూర్తయ్యే వరకు ఆగి, ఆ తర్వాత ఏర్పడే ఖాళీల ప్రకారం గవర్నర్‌ పోస్టుల్లో భర్తీ చేయవచ్చని పార్టీలో కొందరు సీనియర్‌ నేతలు చెబుతున్నారు. కాగా, దత్తాత్రేయ సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ప్రాతనిథ్యం వహస్తుండగా, కల్‌రాజ్‌ మిశ్రా ఉత్తరప్రదేశ్‌ లోని దేవరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహస్తున్నారు. ఈ ఇద్ద‌రు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయే ప‌రిస్థితి ఉందంటున్నారు.