Begin typing your search above and press return to search.

దసరాకు ముందు విస్తరణ.. ఛాన్సే లేదు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   28 Aug 2019 6:30 AM GMT
దసరాకు ముందు విస్తరణ.. ఛాన్సే లేదు.. ఎందుకంటే?
X
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని మీద మీడియా పెద్దగా రియాక్ట్ అవుతున్నది లేదు. అలాంటిది గడిచిన రెండు.. మూడు రోజులుగా మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రతి మీడియా సంస్థ కేబినెట్ విస్తరణ మీద వార్తలు ఇచ్చేస్తున్నాయి. విస్తరణ జరిగితే ఎవరికి అవకాశాలు లభిస్తాయన్న విషయంపై భారీ ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ అంశం ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుందంటే కారణం లేకపోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఊహించిన రీతిలో మజ్లిస్ అధినేత అసదుద్దున్ ఓవైసీ తాజాగా కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని.. ఆయన మంత్రిగా మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

అసద్ లాంటోడి నోటి నుంచి కేటీఆర్ కు కేబినెట్ లో చోటు ఇవ్వమన్న మాట వచ్చిందంటే.. విషయంలో ఏదో ఉన్నట్లే. ఎవరో ఒకరి సూచనతో తప్పించి.. అసద్ తనకు తానుగా ఇలాంటి మాటల్ని మాట్లాడటం ఆయనకు అలవాటు లేదనే చెప్పాలి. అలాంటిది అసద్ నోటి నుంచి రావటం..నిన్నటికి నిన్న యూసఫ్ గూడలో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో కేటీఆర్ మంత్రి కావాల్సిన అవసరం ఉందన్న మాటను టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ నోటి నుంచి రావటం గమనార్హం.

దీంతో.. మంత్రివర్గవిస్తరణకు టైం దగ్గరకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ దసరా నాటికి కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరిగినా.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పండక్కి ముందే జరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. కేసీఆర్ కు ఉన్న సెంటిమెంట్లు..నమ్మకాలు ఎక్కువ.

ఏం చేసినా మంచిరోజులు చూసుకోవటంతో పాటు తిధి.. నక్షత్రం.. వారం.. వర్జ్యం లాంటివి చాలానే పరిగణలోకి తీసుకుంటారు. మరో నాలుగైదు రోజుల్లో వినాయకచవితి.. పండగ ఆ తర్వాత నెల వరకూ ఏ పని పెట్టుకోరు. మళ్లీ ఏదైనా పెద్ద పని చేయాలంటే దసరాకే. ఆ లోపు ఏ పెద్ద పనిని.. ముఖ్యమైన పనిని చేపట్టేందుకు రోజులు అనువుగా లేవని శాస్త్రం చెబుతుంది. ఇలాంటివేళలో.. కేబినెట్ విస్తరణ లాంటి పెద్ద విషయాన్ని దసరాకు ముందు తేల్చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పక తప్పదు.