Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ గుడ్ న్యూస్...షాకులేవీ ఉండ‌వ‌ట‌

By:  Tupaki Desk   |   2 Dec 2017 5:15 PM GMT
హెచ్‌1బీ గుడ్ న్యూస్...షాకులేవీ ఉండ‌వ‌ట‌
X
భార‌తీయ టెకీల‌కు గుడ్ న్యూస్‌. అగ్ర‌రాజ్యం అమెరికాలో కెరీర్ వెతుక్కునేందుకు మ‌న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎక్కువ‌గా ఆధార‌ప‌డే హెచ్‌1బీ వీసాల విష‌యంలో అమెరికా తీపిక‌బురు తెలిపింది.హెచ్‌1బీ వీసా జారీ విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకొనిరాలేదని, పాత విధానమే అమలవుతున్నదని అమెరికా స్పష్టంచేసింది. హెచ్‌ 1 బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం ఉద్దేశించిన బిల్లు ఇంకా చట్టసభలో పాస్‌ కాలేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్‌ స్టేట్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్న థామస్‌వాజ్దా పేర్కొన్నారు. దీంతో మ‌న టెకీల‌కు పెద్ద ఊర‌ట ద‌క్కిన‌ట్ల‌యింది.

బెంగాల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొనేందుకు కోల్‌కతా వచ్చిన థామస్‌వాజ్దా ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. హెచ్‌1బీ వీసాల జారీపై సమీక్ష జరుపాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించారనీ, అయితే ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ప్రస్తుత వీసాల విధానం మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకొనిరావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పాత విధానంలోనే వీసాలు జారీచేస్తున్నట్టు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్‌ స్టేట్‌ సెక్రటరీ థామస్‌వాజ్దా స్పష్టంచేశారు.

కాగా, విదేశీ ఔట్ సోర్సింగ్‌ల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని, త‌ద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోంద‌ని ఆ దేశంలో పలువురు ఆందోళ వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హెచ్-1బీ, ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ సంయుక్త చట్టసభ సభ్యులు కొద్దికాలం క్రితం ప్ర‌తిపాదించారు. అమెరికా అధ్య‌క్ష ప‌గ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సైతం వ‌ల‌స వ్య‌తిరేక‌వాది కావ‌డంతో మ‌న‌వారిలో కొంత క‌ల‌వ‌రం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తాజా కబురు టెకీల‌కు సంతోషాన్ని ఇచ్చేద‌ని అంటున్నారు.

కాగా, ప్ర‌తి ఏటా 85 వేల హెచ్‌-1బీ వీసాల‌ను అమెరికా జారీ చేస్తుంది. ఈ మొత్తం 85 వేల వీసాల్లో 65 వేలు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ కాగా.. 20 వేల వీసాల‌ను అమెరికా విద్యాసంస్థ‌ల్లో మాస్ట‌ర్స్, అంత‌క‌న్నా ఉన్న‌త చ‌దువులు చ‌దివిన విదేశీ విద్యార్థుల‌కు జారీ చేస్తారు. ప్ర‌త్యేక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగుల‌ను తాత్కాలికంగా త‌మ కంపెనీల్లో నియ‌మించుకొనే అవ‌కాశం హెచ్‌-1బీ వీసాల వ‌ల్ల క‌లుగుతుంది. సైన్స్‌ - ఇంజినీరింగ్‌ - ఐటీ రంగాల్లో ఎక్కువ‌గా హెచ్‌-1బీ వీసాదారుల అవ‌స‌రం ఉంటుంది.