Begin typing your search above and press return to search.

పోలవరం ఎత్తులో ఎటువంటి మార్పుల్లేవు.. పీపీఏ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:30 AM GMT
పోలవరం ఎత్తులో ఎటువంటి మార్పుల్లేవు.. పీపీఏ కీలక వ్యాఖ్యలు
X
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్ష టీడీపీ ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలవరం నిర్మాణంలో ఎటువంటి మార్పులు లేవని ప్రాజెక్టు అథారిటీ సభ్యులు తాజాగా తేల్చిచెప్పారు. కొద్ది రోజులుగా టీడీపీ అగ్రనాయకులు తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనిపై రోజు ఒక వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో మంత్రులు టీడీపీ నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గించడంలేదని చెబుతూ వచ్చారు. ఈ విషయమై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వార్ కొనసాగుతుండగానే ఇవాళ పోలవరం అథారిటీ ప్రతినిధులు పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజులపాటు ప్రతినిధుల బృందం పోలవరం పనులను పరిశీలించనుంది.

ఇందులో భాగంగా ప్రాజెక్టు సంబంధించిన కీలక అంశాలపై వారు నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తారు.తొలిరోజు పర్యటనలో పీపీఏ సభ్యులు పోలవరం నిర్మాణ పనులను పరిశీలించి ప్రాజెక్టు ఎత్తు ఈ విషయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు లేవని నిర్ధారించారు. గతంలో ఎంత ఎత్తుకు నిర్మాణం మొదలుపెట్టారో అంతే ఎత్తుతో పనులు జరుగుతున్నట్టు తేల్చారు. తొలి డీపీఆర్ ఆధారంగానే పనులు జరుగుతున్నట్టు నిర్ధారించారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై వస్తున్న వార్తలకు సంబంధించి ప్రాజెక్టు అథారిటీ సీఈ ఏకే ప్రధాన్ మాట్లాడారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించ లేదని చెప్పారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపు ఎవరి వల్లా కాదని, ఇది సాధ్యం అయ్యే పని కూడా కాదని తేల్చారు. ప్రాజెక్టు సంబంధించిన 76% కాంక్రీట్, హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయినట్లు చెప్పారు. పునరావాసం, ఇతర పనులు కలిపి 41శాతం పూర్తయినట్లు చెప్పారు. పనులు జరుగుతున్న తీరునుబట్టి అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన వారిలో పీపీఏ సభ్యులు మోహన్(డీఏ), అమిత్ సింగ్ (సీఈ -పవర్ సెక్టార్), పోలవరం ఎస్ ఈ నాగిరెడ్డి, డీఈలు బాలకృష్ణ రామేశ్వరం నాయుడు, ఈఈ ఆదిరెడ్డి, మెగా ఇంజినీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు, అంగర మిశ్రా ఉన్నారు.