Begin typing your search above and press return to search.

తేల‌ని లెక్క‌లు.. వీడ‌ని చిక్కులు

By:  Tupaki Desk   |   4 Nov 2018 9:26 AM GMT
తేల‌ని లెక్క‌లు.. వీడ‌ని చిక్కులు
X
తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్పాటైన మ‌హా కూట‌మిలో సీట్ల లెక్క‌ల‌పై ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగుతోంది. వ‌రుస‌గా భేటీలు జ‌రుగుతున్నా.. ఎవ‌రికెన్ని సీట్లు? ఏ సీటు ఎవ‌రికి? అనే అంశాల‌పై ఏకాభిప్రాయం కుద‌ర‌ట్లేదు. దీంతో ఎన్నిక‌ల లోపే కూట‌మి కుదేల‌వుతుంద‌నే అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్న కాంగ్రెస్‌ - టీడీపీ - టీజేఎస్ - సీపీఐ మాత్రం త‌మ మ‌ధ్య పొత్తు ఖాయ‌మేన‌ని.. త్వ‌ర‌లోనే సీట్ల పంప‌కం జ‌రుగుతుంద‌ని చెబుతున్నాయి
.
మ‌హా కూట‌మిలో ప్ర‌ధాన ప‌క్షం కాంగ్రెస్‌. ఇటీవ‌ల ఆ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఢిల్లీలో భేటీ అయింది. అనంత‌రం తెలంగాణ‌లో హ‌స్తం నేత‌లు పోటీ చేయ‌నున్న స్థానాల‌పై కొన్ని వివ‌రాలు బ‌య‌ట‌కొచ్చాయి. మ‌హా కూట‌మి పొత్తుల్లో భాంగంగా కాంగ్రెస్ 95 స్థానాల నుంచి పోటీ చేస్తుంద‌ని కొంత‌మంది నేత‌లు ప్ర‌క‌టించారు కూడా. ఇక టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తార‌ని - టీజేఎస్‌-సీపీఐ క‌లిసి 10 సీట్ల‌లో స‌ర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిసింది. ఇందులో టీజేఎస్‌కు 8, సీపీఐకి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించే అవ‌కాశ‌ముంది.

కాంగ్రెస్ చూపించిన ఈ లెక్క‌ల‌పై టీడీపీ - టీజేఎస్‌ - సీపీఐ కాస్త ఆగ్ర‌హంతో ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ తాము 35 స్థానాల్లో బ‌లంగా ఉన్నామ‌ని.. కేవ‌లం 14 సీట్లే ఇస్తామ‌ని చెప్ప‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో తాము 15 స్థానాల‌ను గెల్చుకున్న సంగ‌తిని గుర్తుచేస్తోంది. ఆ 15 సీట్ల‌తోపాటు న‌కిరేక‌ల్ - కోదాడ‌ - కొత్త‌గూడం - ప‌టాన్‌ చెరు స్థానాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఆయా స్థానాల్లో ప్ర‌చార‌ ప‌ర్వాన్ని ప్రారంభించుకోవాల‌ని ఇప్ప‌టికే త‌మ పార్టీ నేత‌ల‌కు సూచించింది.

ఇక టీజేఎస్ కూడా త‌మ‌కు కేవ‌లం 8 సీట్లు కేటాయిస్తుండ‌టంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. క‌నీసం 12 సీట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో భేటీ అనంత‌రం టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దృష్టికి కోదండ‌రాం ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. కేటాయించే సీట్ల సంఖ్య‌ను పెంచ‌క‌పోతే త‌మ పార్టీలో సామాజిక కూర్పు దెబ్బ‌తినే ముప్పంద‌ని ఆయ‌న సూచించారు.

ఇక మ‌హా కూట‌మి ఏర్పాటులో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన త‌మ‌కే సీట్ల కేటాయింపులో అన్యాయం జ‌రుగుతోంద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాము 12 సీట్లు అడిగామ‌ని.. కానీ కేవ‌లం రెండు సీట్ల‌తో స‌ర్దుబాటు చేసుకోవాల‌ని చెప్ప‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. సీట్ల సంఖ్య పెంచ‌కపోతే కూట‌మిని వీడేందుకూ తాము వెన‌కాడ‌బోమ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌హా కూట‌మిలో సీట్ల పంప‌కంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.