Begin typing your search above and press return to search.

బోఫోర్స్‌ మీద ప్రథమ పౌరుడే అలా అంటారా?

By:  Tupaki Desk   |   26 May 2015 8:50 AM GMT
బోఫోర్స్‌ మీద ప్రథమ పౌరుడే అలా అంటారా?
X
దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రథమ పౌరుడు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం తెలిసిందే. చాలాకాలం తర్వాత పూర్తిస్థాయి రాజకీయ నేత ఒకరు దేశ రాష్ట్రపతిని చేపట్టటం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసి.. ఆ పార్టీ అధినాయకత్వానికి అత్యంత విధేయుడైన వ్యక్తి.. తాజాగా రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ.

తాజాగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన బోఫోర్స్‌ కుంభకోణం వ్యవహారంపై ప్రణబ్‌దాదా తీవ్ర చర్చను రేపే వ్యాఖ్యలు చేశారు.

1986లో అప్పటి రాజీవ్‌గాంధీ సర్కారు స్వీడన్‌కు చెందిన హోవిట్జర్‌ శతఘ్నుల్ని భారత సైన్యానికి అప్పగించేందుకు రూ.1600 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా రూ.64 కోట్లు చేతులు మారాయంటూ భారీగా కథనాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి మీడియాలో చాలానే ఆధారాలు వెలుగు చూశాయి. ఈ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించటమే కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోశాయి కూడా.

ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ.. దీన్ని స్కాంగా మీడియా సంస్థలు మాత్రమే అభివర్ణించాయి తప్పించి.. ఏ న్యాయస్థానమూ తీర్పు చెప్పలేదన్న వ్యాఖ్య చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన ఖత్రోచీ 2013 జూలైలో ఇటలీలో మరణించటం తెలిసిందే. బోపోర్సు కుంభకోణం గురించి ఇప్పటివరకూ మరే కాంగ్రెస్‌ నేత చెప్పనంత బలంగా.. దాన్ని కుంభకోణం కాదంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్‌ వ్యాఖ్యానించటం చూసినప్పుడు.. ఆయనలోని కాంగ్రెస్‌ వాసనలు ఇంకా పోలేదా? అన్న సందేహం కలగక మానదు.