Begin typing your search above and press return to search.

తార‌లు దిగొచ్చినా.. ఖాళీగా ఎల్ బీ స్టేడియం

By:  Tupaki Desk   |   19 Dec 2017 6:30 AM GMT
తార‌లు దిగొచ్చినా.. ఖాళీగా ఎల్ బీ స్టేడియం
X
నిజంగానే నిజం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ వేదిక మీద చూడ‌ని కాంబినేష‌న్ ఒక‌టి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల వేదిక మీద ఆవిష్కృత‌మైంది. ఒక వేదిక మీద సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. మెగాస్టార్ చిరంజీవి.. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. యువ‌సామ్రాట్.. న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున‌.. విక్ట‌రీ వెంక‌టేశ్‌.. మోహ‌న్ బాబు.. బ్ర‌హ్మానందం.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. సుమ‌న్‌.. పోసాని కృష్ణ‌ముర‌ళి.. ఆర్ నారాయ‌ణ‌మూర్తి.. జ‌య‌సుధ‌.. రాజ‌మౌళి.. అల్లు అర‌వింద్‌.. రాఘ‌వేంద్ర‌రావు.. దిల్ రాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే భారీ లిస్టే ఉంది. మ‌రి.. ఇలాంటి వారంతా ఒకే వేదిక మీద‌కు రావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఎందుకంటే.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా డిజైన్ చేసిన పోగ్రాం షీట్ లో ఎక్క‌డా కూడా ఇంత భారీ తారాగ‌ణం వ‌స్తార‌న్న స‌మాచారం లేదు. మిగిలిన వారి సంగ‌తి త‌ర్వాత‌.. మీడియాకు సైతం

సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ ఇంత భారీగా సినీతార‌లు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌న్న సమాచారం లేదు. తెర వెనుక జ‌రిగిన ప‌రిణామాల‌తో భారీ తారాగ‌ణం ఒక్క‌సారిగా ఎల్ బీ స్టేడియంకు క్యూ క‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎల్బీ స్టేడియంలో చిత్ర‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. చిన్న సినిమా ఫంక్ష‌న్ జ‌రుగుతుందంటే చాలు.. జ‌నాలు పోటెత్తుతారు. భావోద్వేగంతో సాగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఒక కార్య‌క్ర‌మానికి క‌నివినీ ఎరుగ‌ని కాంబినేష‌న్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ.. ఏ వేదిక మీద చూడ‌ని రీతిలో సినీ ప్ర‌ముఖులంతా ఒక చోట చేరిన వేళ‌.. జ‌నాలు ఏ స్థాయిలో వ‌స్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అందుకు భిన్నంగా భారీ ఎత్తున సినీ ప‌రిశ్ర‌మ‌కు దిగ్గ‌జాలు లాంటి మ‌హాన‌టులు ఒకేచోట‌కు చేరినా.. స్టేడియంలో జ‌నాలు మాత్రం లేరు.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇంత భారీ తారాగ‌ణం ఎల్బీ స్టేడియంకు వ‌స్తుంద‌న్న ముంద‌స్తు స‌మాచారం లేక‌పోవ‌ట‌మే. తెలుగు మ‌హాస‌భ‌ల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌ని.. పేరుకు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లే అయిన‌ప్ప‌టికీ.. తెలంగాణ ప్రాంతానికే ప‌రిమితం అయ్యేలా స‌మావేశాల్ని నిర్వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శ అంత‌కంత‌కూ పెరిగింది.

ఈ స‌భ‌ల ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారిని చిన్న‌బుచ్చ‌టంతో పాటు.. అవ‌మానానికి గురి చేశార‌న్న మాటకు ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు సీమాంధ్ర పాల‌కులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని నిర్ల‌క్ష్యం చేసి త‌ప్పు చేస్తే.. ఇప్పుడు అలాంటి త‌ప్పే మ‌ళ్లీ చేయాలా? అన్న ప్ర‌శ్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప‌లువురి నోట రావ‌టం క‌నిపించింది.

ఇంతా చూస్తే.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ద్వారా భారీ మైలేజీని ఆశించిన కేసీఆర్ అండ్ కోకు.. అందుకు భిన్నంగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్టేందుకు చివ‌రి క్ష‌ణంలో తీసుకున్న నిర్ణ‌యంతోనే ఇంత భారీ ఎత్తున తార‌లు వ‌చ్చార‌ని చెబుతున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌తో ముడిప‌డిన అంశంగా సినీ ప్ర‌ముఖుల‌కు వ్య‌క్తిగ‌తంగా స‌మాచారం అంద‌టం.. దీనికి త‌గ్గ‌ట్లే ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌లు కొంద‌రు స్వ‌యంగా రంగంలోకి దిగ‌టంతో.. అప్ప‌టిక‌ప్పుడు గంట‌ల వ్య‌వ‌ధిలోనే సినీ ప్ర‌ముఖుల స‌మీక‌ర‌ణ కార్య‌క్ర‌మం మొద‌లైంద‌ని తెలుస్తోంది.

సినీ ప్ర‌ముఖుల స‌మీక‌ర‌ణ మీద మాత్ర‌మే దృష్టి పెట్ట‌టం.. ఆ వివ‌రాల్ని మీడియా ద్వారా ప్ర‌చారం చేయ‌క‌పోవ‌టంతో స్టేడియంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి పెద్ద‌గా హాజ‌రు లేద‌ని చెప్పాలి. దీనికి తోడు సోమ‌వారం కావ‌టంతో చాలామంది ఆఫీసుల‌కు వెళ్ల‌టం కూడా హాజ‌రు శాతం త‌క్కువ కావ‌టానికి కార‌ణంగా చెప్పాలి. ఏమైనా అపూర్వం అన్న సీన్ కు స్టేడియంలో జ‌నాలు ఏమాత్రం లేదు. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరును సినిమా భాష‌లో చెప్పాలంటే.. సినిమా సూప‌ర్ గా ఉంది.. క‌లెక్ష‌న్లే లేవన్న‌ట్లుగా మారింది.