Begin typing your search above and press return to search.

వద్దు బాబోయ్‌ ఎంపీ సీటు..!

By:  Tupaki Desk   |   4 Feb 2019 10:13 AM GMT
వద్దు బాబోయ్‌ ఎంపీ సీటు..!
X
ఎంపీ సీటు.. ఇప్పుడు ఏ పార్టీ టికెట్ ఇస్తామన్నా నేతలు జడుసుకుంటున్నారు. వద్దు బాబోయ్ అంటూ ఆమడ దూరం పారిపోతున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ - విద్యా సంస్థల అధినేత - ఎంపీ మల్లారెడ్డి కూడా ఎంపీ పదవిని త్యజించి మరీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్ల కోసం కొట్టుకుంటున్న వారిని చూస్తున్నాం..కానీ ఎంపీ సీట్లంటే మాత్రం అస్సలు పోటీ కనిపించడం లేదు. నేతలు ఢిల్లీ ఫైట్ ఎక్కడం కంటే రాష్ట్ర అసెంబ్లీకి పోవడానికే ఇష్టపడుతున్నారు. ఖర్చుపెట్టడానికి సాహసించని వారి చూపంతా అసెంబ్లీ వైపే ఉంటుంది. పార్టీలు కూడా పైసా లేని వాళ్లను పార్లమెంట్ కు పంపకుండా ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాయి. పెద్దపల్లి ఎంపీగా ఉన్న టీఆర్ ఎస్ యువనేత సుమన్ కు ఆర్థిక అండదండలు లేని కారణంగా చెన్నూర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టీఆర్ ఎస్ గెలిపించుకున్నట్టు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.. పెద్దపల్లి సీటును దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త - భారీగా ఆస్తులున్న గడ్డం వివేక్ కు ఇవ్వడానికి టీఆర్ ఎస్ హామీ ఇచ్చింది. దీన్ని బట్టి ఎంపీ సీటు అంటే ఎంత ఖరీదైందో... ఎంత వ్యయప్రయాసలు మిగులుస్తుందో.. నేతలు ఎందుకు ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడడం లేదో అర్థమవుతోంది.

*ఎంపీ సీట్లకు భయపడుతున్న పొలిటీషియన్స్

ఒకప్పుడు ఎంపీ సీటు అంటే హాట్ కేక్. మేము పోటీచేస్తామంటూ బడా పారిశ్రామికవేత్తలు - సినీ ప్రముఖులు - డబ్బున్న వారు పార్టీలకు భారీగా ఫండింగ్ ఇచ్చి మరీ తీసుకొని పోటీ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంపీ సీటు ఖరీదైన వ్యవహారంగా మారింది. నేతల చేతి చమురు వదులుతోంది. ప్రస్తుతం ఒక ఎంపీ సార్వత్రిక ఎన్నికల్లో నిల్చోవాలంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో ఎమ్మెల్యే 5 కోట్ల చొప్పున ఎంత లేదన్నా కనీసం 35 కోట్ల దాకా వెచ్చించాలి. పార్టీఫండ్ 10 కోట్లు వేసుకున్నా కనీసం 50 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్లైతేనే ఎంపీ బరిలో నిలబడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఈ రేటు అధికార పక్షానిది మాత్రమే.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఈ రేటు ఇంకాస్తా ఎక్కువగానే ఉంటుంది.

*అప్పుడు ఓకే.. ఇప్పుడు నాట్ ఓకే..

కొన్నేళ్ల వరకు బ్లాక్ మనీ భారీగా మూలిగి ఉండేది.. బడా పారిశ్రామికవేత్తలు వైట్ మనీగా మార్చేందుకు ఇలా ఎన్నికల్లో బరిలోకి దిగి పదవి కొట్టేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రం నోట్ల రద్దు - జీఎస్టీ - సహా కీలక పన్ను - బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపుతోంది. కేంద్రం సంస్కరణలతో నేతల వద్ద పెద్దగా డబ్బు చలామణీ కావడం లేదు. దీంతో ఎంపీ సీటుకోసం 50 కోట్లు ఖర్చు పెట్టినా గెలుపు గ్యారెంటీ ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎంపీ టికెట్లను ఇస్తామని ఆఫర్ చేసినా తీసుకోవడానికి నేతలు - బడా పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. ప్రస్తుతం పార్టీల్లో ఎంపీ టికెట్లు అమ్ముడు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. ఖర్చు భారీగా ఉండడం. ప్రయోజనం పెద్దగా కనిపించకపోవడంతో ఎంపీ టికెట్లకు డిమాండ్ క్రమక్రమంగా తగ్గినట్టు కనిపిస్తోంది.

--- ఎస్.ఆర్.కె