Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలంలో ఈ భారత ఆటగాళ్లకు గిరాకీ లేనట్టే..

By:  Tupaki Desk   |   7 Dec 2021 2:30 PM GMT
ఐపీఎల్ వేలంలో ఈ భారత ఆటగాళ్లకు గిరాకీ లేనట్టే..
X
హర్భజన్ సింగ్.. ఒకప్పటి మేటి ఆఫ్ స్పిన్నర్. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్. అంబటి రాయుడు.. అద్భుత ప్రతిభావంతుడు. ఓ దశలో టీమిండియాలో స్టార్ అవుతుడానుకున్నారు. సురేశ్ రైనా.. తిరుగులేని బ్యాటర్, ఫీల్డర్. అటు ఐపీఎల్ లోనూ తమతమ ఫ్రాంచైజీలకు వీరు పెద్ద స్టార్లు. గత సీజన్ వరకు వీరికి ఫలానా ఫ్రాంచైజీ అని ఉండేది.

అయితే, ఈ సారి మెగా వేలం జరుగనుంది. రెండు కొత్త జట్లు రానున్నాయి. మరోవైపు నలుగురినే ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని మిగతావారిని వదిలేశాయి. ఇప్పుడు వీరిలో కొందరిని ప్రాధాన్య ప్రాతిపదికన ఎంపిక చేసుకోనున్నాయి. మిగతా 15 లేదా 20 మంది కోసం వేలంలో పాల్గొనున్నాయి.

రాయుడు, భజ్జీలకు నో చాన్సేనా?

ఐపీఎల్ 2022 లో భారీ మార్పులే కాదు.. కొందరు ఆటగాళ్లనూ మనం చూడలేం. డివిలియర్స్, బ్రేవో తదితరులు ఇందులో ప్రధానం. దీనికితోడు కొందరు భారత స్టార్లూ విస్మరణ అంచుల్లో ఉన్నారు. వీరిలో కీలకంగా చెప్పుకోవాల్సింది హర్బజన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా. భజ్జీ ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ లో ఉన్నాడు. రాయుడు, రైనా చెన్నై సభ్యులు.

జనవరిలో జరిగే వేలంలో వీరిని ఆయా జట్లు తీసుకుంటాయా? అంటే చెప్పలేని పరిస్థితి. కొన్నేళ్లుగా ఒకే తరహా జట్టుతో ఆడుతుండడంతో పూర్తిగా మార్పును కోరుకునే అవకాశం ఉంది. దీంతో పాత కాపులను వదిలించుకోవచ్చు.

రాయుడు ఫిట్ నెస్ సమస్యలకు తోడు ఫామ్ గొప్పగా లేదు. భజ్జీ ఎప్పుడో ఫేడ్ అయిపోయాడు. రైనా తీరు గతేడాది ఐపీఎల్ సీజన్లో వివాదాస్పదం అయింది. జట్టు ప్రదర్శన పైనా ప్రభావం చూపింది. ఈ ఏడాదికి కొనసాగించినా.. ఆఖర్లో చోటు దక్కలేదు. మిస్టర్ ఐపీఎల్’గా మారి లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రైనా ఒకడు.

కానీ, వ్యక్తిగత సమస్యల కారణంగా 2020 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. ఆపై 2021 ఎడిషన్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో చెన్నై ఈసారి అతడిని రిటైన్ చేసుకోలేదు. రుతురాజ్ వంటి కుర్రాడి వైపు మొగ్గింది. ఫామ్, వయస్సు దృష్ట్యా రైనాకు ఐపీఎల్ 2022లో ఛాన్స్ దొరికే అవకాశం లేదు. మరోవైపు రెండు కొత్త జట్ల చేరికతో, కొత్త ఫ్రాంచైజీలు జట్టును నిర్మించాలని చూస్తున్నందున మెగా వేలం భారీగానే జరగబోతోంది.

ఇంకొందరూ ఉన్నారు

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్.. వదిలించుకోవాల్సిన జాబితాలో వినిపిస్తున్న మరో పేరు. 2018 సీజన్లో అద్భుత ఫామ్ కనబర్చిన కార్తీక్ గత రెండు సీజన్లుగా పేలవంగా ఆడుతున్నాడు. కోల్ కతా కు పెద్ద ఇబ్బందిగా తయారయ్యాడు. అందుకే ఇతడి బదులు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ లాంటి కుర్రాడిని రిటైన్ చేసుకుంది.

అసలు కేకేఆర్ తమ కెప్టెన్ మోర్గాన్ నే రిటైన్ చేసుకోలేదు. ఇక కార్తీక్ కు చోటు కష్టమే అంటున్నారు. ఢిల్లీ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్, ముంబైలో పాండ్యా సోదరులు, హైదరాబాద్ లో సాహా ఇలా కొందరు సీనియర్ క్రికెటర్లు ఈసారి వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.